No Toll Charges | సంక్రాంతికి ఆ రూట్ లో టోల్ చార్జీల రద్దు

సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ చార్జీల రద్దుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పండుగ ముందు, వెనుక మూడు రోజులు ఫ్రీ వే కోసం కేంద్రానికి విన్నవించారు.

Komatireddy Venkat Reddy

No Toll Charges | సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ – విజయవాడ హైవే పై టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తామని..పండుగ ముందు మూడు రోజులు..తర్వతా మూడు రోజులు టోల్ చార్జీలు లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. టోల్ చార్జీల భారాన్ని రాష్ట్ర ఆర్ ఆండ్ బీ శాఖ కేంద్రానికి చెల్లిస్తుందని..ఇందుకు అనుమతి కోసం కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించేందుకు అపాయిట్మెంట్ కోరడం జరిగిందని వెల్లడించారు. సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ – విజయవాడ హైవే పై జనవరి 8 నుండి వాహన రద్దీ ఎక్కువ ఉంటుందని, సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు అని కోమటిరెడ్డి అధికారులకు వివరించారు. పోయినసారి ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుందని…దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు నేను తూప్రాన్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తానని చెప్పారు. ప్రధానంగా ఎల్బీనగర్ నుండి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో వేలాది వాహనాలు రద్దీ ఏర్పడుతుందని..ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు అని అధికారులకు స్పష్టం చేశారు.

పండుగ రద్ధీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

పండుగ సందర్భంగా జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ సమస్యల నివారణకు ఆ రోజుల్లో హెవీ వెహికల్స్ కు అనుమతి నిరాకరించాలని నిర్ణయించామని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ లో వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుని..గుంతలను ఈ రోజు రాత్రి నుంచే పూడ్చే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి 20కిలో మీటర్లకు అంబులెన్స్ లను సిద్దంగా ఉంచుతామని..రోడ్దు భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం పండుగ సందర్భంగా 2వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని..ఇందుకోసం డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడటం జరిగిందన్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వచ్చే పట్టణాలు చిట్యాల , చౌటుప్పల్ సహా ఎక్కడా కూడా రోడ్ల వెంట వాహనాలు నిలుపరాదని..నిలిపిన వాహనాలను సీజ్ చేస్తారని తెలిపారు. అలాగే ఎక్కడైనా వాహనాల సమస్యలతో ట్రాఫిక్ జామ్ జరిగితే వాటిని తొలగించేందుకు భారీ క్రేన్లు అందుబాటులో పెడుతున్నామని పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి సందర్బంగా రహదారి విధుల్లో ఉండే ఆర్ ఆండ్ బీ, రోడ్డు ట్రాన్స్ పోర్టు శాఖల ఉన్నతాధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

రహదారిపై అన్ని లేన్ లు తెరిచే ఉంచాలి

పండుగ రద్దీ ఉన్న రోజుల్లో రోడ్డు లేన్‌లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు చేయవద్దని సూచించారు. అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలన్నారు. పండుగ మొదలుకానున్న తేదీకి ముందే రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలు పూర్తిగా తొలగించాలన్నారు. అన్ని రహదారి లేన్‌లు వాహనాల రాకపోకలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలని, రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట పగలు, రాత్రి స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. హై-విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, ట్రాఫిక్ వెళ్లే దారి స్పష్టంగా కనబడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ట్రాఫిక్‌కు అయోమయం కలిగించే ఏర్పాట్లు ఉండకూడదని తెలిపారు.

అదనపు సిబ్బంది నియామకం

రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వయం పాటించాలన్నారు. అన్ని సంబంధిత శాఖలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని, రోడ్డు పనుల్లో ఉన్న సిబ్బంది అందరూ డ్రెస్ కోడ్ జాకెట్లు (పసుపు / నారింజ రంగు) తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. రాత్రి సమయంలో జంక్షన్లు, వర్క్ జోన్‌ల వద్ద తగినంత వెలుతురు ఏర్పాటు చేయాలన్నారు. బారికేడ్లు, ట్రాఫిక్ ఐలాండ్‌లపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. రూట్ పేట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని రహదారి ఘటనలను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా సజావుగా వెళ్లేలా అదనపు బృందాలను మోహరించాలని తెలిపారు.

సమీక్ష సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నేషనల్ హైవే అథార్టీ రీజినల్ అధికారి శివ శంకర్, ఎంవోఆర్ టీహెచ్ రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్, డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీ, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు,ఆర్ అండ్ బీ ఈ ఎన్సీలు జయభారతి, మోహన్ నాయక్, ఎస్.ఈ ధర్మారెడ్డిలు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి :

ప్రియాంక వాధ్రా కొడుకు రైహాన్‌ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?
US Vlogger Gabruji Emotional Video : ఇండియాను మిస్ అవుతా.. అమెరికా పర్యాటకుడి భావోద్వేగం

Latest News