విధాత: బాలయ్యకు ప్రియమైన అబ్బాయి తారకరత్న. ఆ విషయం కొన్ని రోజులుగా అందరూ చూస్తూనే ఉన్నారు. తారకరత్న కాలం చేసిన తర్వాత బాలయ్య తీవ్ర వేదనకు గురయ్యారు. చివరి క్షణం వరకు కాపాడేందుకు బాలకృష్ణ ప్రయత్నం చేశారు. మెరుగైన వైద్యం కోసం విదేశీవైద్యులను రప్పించారు. పూజలు, దీపారాధనలు ఇలా ఎన్నో చేయించారు.
కానీ తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఫిబ్రవరి 18న శివరాత్రి నాడు ఆయన శివైక్యం చెందారు. తారకరత్న కన్నుమూసిన అనంతరం పార్థివదేహాన్ని బెంగుళూరు నుండి హైదరాబాదు నివాసానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత రోజు అభిమానులు, ప్రముఖుల దర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఆ సమయంలో బాలయ్య వద్దకు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి దూసుకొని వచ్చాడు. జుట్టు పెరిగి మురికి బట్టలతో ఉన్న వ్యక్తి బాలయ్యకు వేలు చూపిస్తూ మాట్లాడాడు. దుఃఖంలో ఉన్న బాలయ్య అతని పక్కకు లాగేయమనలేదు. కాసేపు అతని మాటలు విన్నాడు.
ఆ మతిస్థిమితం లేని వ్యక్తి హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. నందమూరి కుటుంబంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. అతని చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు ఆ వ్యక్తి ఎవరని ఆరాతీస్తే.. ఫిలింనగర్‌లో అటు ఇటు తిరిగే పిచ్చోడని.. జనాలు అతనిని పట్టించుకోరనేలా టాక్ బయటకి వచ్చింది.
అయితే బాలయ్య విషయంలో అతన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఏకంగా శివుడే అతని రూపంలో వచ్చి హెచ్చరించాడనేలా ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటుండటం విశేషం. నందమూరి కుటుంబంలో ఏదో ఒక ఘోరం జరుగుతూనే ఉంది.
2014లో జానకిరామ్, 2018లో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఇటీవల ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించడం, ఆమె కన్నుమూసిన కొన్ని నెలలకే 39 సంవత్సరాల వయసులో తారకరత్న ఇలా హఠాన్మరణం చెందడం వంటి క్రమంలో బాలయ్యను దేవుడు హెచ్చరించాడంటూ ఒక వాదన మొదలైంది.
అయితే ఆ పిచ్చోడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ.. కొందరు కొట్టి పారేసేలా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. బాలయ్యకి ఎక్కువగా దైవభక్తి, నమ్మకాలు కావడంతో.. ఆయన ఎలా ఈ విషయాన్ని తీసుకుంటారనేది ఇప్పుడు ప్రాముఖ్యతని సంతరించుకుంది.