Site icon vidhaatha

Nagarjunasagar: చర్చలతోనే జల వివాదాల పరిష్కారం: కృష్ణా బోర్డు చైర్మన్

విధాత: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు చిన్న విషయమని ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయం పాటించి చర్చల ద్వారా సమస్య పరిష్కార దిశలో కృషి చేయాల్సిన అవసరం ఉందని కృష్ణా నది యాజమాన్య బోర్డ్ చైర్మన్ శివనందన్ కుమార్ అన్నారు.

సాగర్ ప్రాజెక్ట్, టేల్ పాండ్‌ల రెండు రోజుల పరిశీలనలో భాగంగా సోమవారం ఆయన నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నిర్వహణ, పవర్ హౌస్ నిర్వాహణను సందర్శించి 19.99 కోట్లతో చేపట్టిన సాగర్ ప్రాజెక్టు స్పిల్ మరమత్తు పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు, అధికారులు స్నేహపూర్వకమైన పరిస్థితులలో సమావేశమై కృష్ణా జలాల పంపకం వినియోగం సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కేటాయించిన దానికంటే నీటిని ఎక్కువ వినియోగించుకున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తగదన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు ఈ విషయంలో నిజాయితీతో వ్యవహరించాలన్నారు.

ప్రతి సంవత్సరం కూడా కృష్ణానది నీటి వినియోగం విషయంలో ఇదే సమస్య తలెత్తడం ఇరు రాష్ట్రాలకు అంత మంచిది కాదన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు స్నేహపూరితమైన సమావేశం నిర్వహించుకొని సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమైనదిగా భావిస్తున్నామన్నారు. సమస్య పరిష్కార దిశలో లేకుంటే తామే ఇరు రాష్ట్రాల వారిని సమావేశపరిచి సమస్య పరిష్కార దిశలో వివాదాలు లేకుండా ఉండే విధంగా కృషి చేస్తామన్నారు. సాగర్ ప్రాజెక్టు స్పిల్ మరమ్మతు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి నాణ్యతతో నిర్వహించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.

వర్షాలు రాకముందే పనులను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్వహణ పట్ల శ్రద్ధ చూపాలన్నారు. నిధుల విడుదలలో జాప్యం చేయకుండా సకాలంలో పనులు పూర్తయ్యేలా చొరవ చూపి ప్రాజెక్టుల మనుగడ మరింత కాలం కొనసాగేలా చూడాలన్నారు. ఆయన వెంట బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తా, ఎస్ఈ అశోక్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కరుణాకర్, ఈఈ శివశంకర్ ఉన్నారు.

Exit mobile version