విధాత: దేశ రాజధానిని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు దుప్పటి కప్పేసింది. 200 మీటర్ల దూరంలో ఏమున్నదో కూడా కనిపించనంత దట్టంగా మంచు కురిసింది. విజిబులిటీ తక్కువగా ఉన్న కారణంగా ఢిల్లీకి వచ్చే, ఢిల్లీ నుంచి బయలుదేరే అనేక విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
బుధవారం ఢిల్లీలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 9 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోవడంతో వచ్చే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
ఢిల్లీలో ఉదయ 5.30 గంటల ప్రాంతంలో 200 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఏమున్నదో కనిపించలేదని వాతావరణశాఖ తెలిపింది. రాజస్థాన్‌లోని బికనీర్, జైపూర్, అజ్మీర్‌లలో 50 మీటర్లు, జమ్ము డివిజన్‌లోని జమ్ములో 200 మీటర్లు, హర్యానాలోని అంబాలాలో 200 మీటర్లు, మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో 200 మీటర్ల దృశ్యమానత రికార్డయినట్టు పేర్కొన్నది.
దేశ రాజధానిలో పొగమంచు కారణంగా 26 రైళ్లు ఆలస్యంగా చేరుకున్నాయని భారతీయ రైల్వే తెలిపింది. ఢిల్లీలో నిరాశ్రయులైన వారు నైట్ షెల్టర్లలో ఆశ్రయం పొందారు.