విధాత: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లా చెన్నారావు పేటలో కొనసాగుతున్నది. అయితే శాంతిభద్రతల దృష్ట్యా షర్మిలను పోలీసులు అరెస్టు చేసి హైదరా బాద్‌కు తరలించారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళనకు దిగిన కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సుదర్శన్‌రెడ్డి, ఆయన భార్య కూడా ఎమ్మెల్యేగా చెలామణి అవుతూ.. డబ్బులు దండుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. అలాగే పేరుకే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని, మనిషిది చిన్న బుద్ధి అని ఘాటుగా విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే పాదయాత్రలో బస్సును తగలబెట్టారు. అన్ని పర్మిషన్లు తీసుకుని పాదయాత్ర చేస్తున్నా.. శాంతిభద్రతల సమస్య సృష్టించి నన్ను అరెస్ట్ చేయాలని, పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. పోలీసులను పనోళ్లలా వాడుకుని దాడులు చేస్తున్నారు.
1/2 pic.twitter.com/bCSV4nGjdR— YS Sharmila (@realyssharmila) November 28, 2022
ఉద్యమకారుడిగా ఉండి నేడు తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు కబ్జాకోరు అయ్యాడని మండిపడ్డారు. ఆయనకు సంపాదన తప్పా మరో ధ్యాసలేదని, ఇలాంటి వారికి ఎందుకు ఓట్లు వేయాలని, కర్రు కాల్చి వాత పెట్టాలని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మా పాదయాత్రకు అనుమతి ఉన్నది అని బస్సుకు నిప్పు పెట్టిన వారిని అరెస్టు చేయకుండా మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
షర్మిలకు గాయాలు
మరోవైపు షర్మిలను అరెస్టు చేసే సమయంలో పోలీసులకు, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. షర్మిల పెదవులు, గదువపై రక్తపు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ గాయాలు ఎలా అయ్యాయో తెలియాల్సి ఉన్నది