Site icon vidhaatha

200 ఏళ్ల త‌ర్వాత.. భార‌త్‌కు శివాజీ ఆయుధం (పులి పంజా)

భార‌త‌దేశానికి చెందిన ఎన్నో విలువైన వ‌స్తువుల‌ను బ్రిటిష‌ర్లు లండ‌న్ త‌రలించి అక్క‌డి మ్యూజియంల‌లో పెట్టుకున్న విష‌యం తెలిసిందే. వాటిని వెన‌క్కి ర‌ప్పించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. అలా భార‌త్ నుంచి త‌ర‌లిపోయి లండ‌న్ మ్యూజియంలో ఉన్న ప్ర‌సిద్ధ వ‌స్తువు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ ఉప‌యోగించిన పులి పంజా (వాఘ్ నఖ్‌) ఆయుధం ఒకటి.




తాజాగా దీనిని భార‌త్‌కు ఇవ్వ‌డానికి లండ‌న్‌లోని విక్టోరియా అండ్ ఆల్బ‌ర్ట్ మ్యూజియం, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇది 3 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే భార‌త్‌లో ఉంటుంది. త‌ర్వాత మ‌ర‌లా లండ‌న్ మ్యూజియంకు అప్ప‌గించాలి.




సుమారు 1820లో భార‌త్‌ను దాటి వెళ్లిపోయిన ఈ శివాజీ ఆయుధం సుమారు 200 ఏళ్ల త‌ర్వాత ఇక్క‌డ అడుగుపెట్ట‌నుంది. శివాజీ మ‌హారాజ్ ప‌ట్టాభిషేకం జ‌రిగి 350 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా ఈ ఏడాది న‌వంబ‌రులో వాఘ్‌న‌ఖ్ (Wagh Nakh) ను ముంబ‌యి తీసుకొస్తారు. మూడేళ్ల పాటు సౌత్ ముంబ‌యిలో ఉన్న ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ మ్యూజియంలో దీనిని ప్ర‌ద‌ర్శ‌నకు ఉంచ‌నున్నారు.



 

ప్ర‌తాప్‌గ‌ఢ్ యుద్ధంలో వాఘ్ న‌ఖ్‌

1659లో జ‌రిగిన ప్ర‌తాప్‌గ‌ఢ్ యుద్ధం చ‌రిత్ర‌లో చాలా కీల‌క‌మైంది. ఈ యుద్ధంలో అఫ్జ‌ల్‌ఖాన్ నేతృత్వంలోని ఆదిల్‌షాహీ సైన్యాన్ని ఓడించిన శివాజీ.. త‌న రాజ్యాన్ని న‌లుచెర‌గులా విస్త‌రించాడు. అయితే ఈ యుద్ధ స‌మ‌యంలోనే సంధి కోస‌మ‌ని అఫ్జ‌ల్‌ఖాన్ శివాజీని తన శిబిరానికి ఆహ్వానిస్తాడు. నిజానికి శివాజీని చంపేయ‌డానికి అఫ్జ‌ల్ వేసిన ప‌న్నాగం ఇది.




దీంతో ముందు జాగ్ర‌త్త‌గా శివాజీ త‌న పులిపంజాను ర‌హ‌స్యంగా చేతి కింద పెట్టుకుని వ‌స్తాడు. అది తెలియ‌ని అఫ్జ‌ల్.. శివాజీని పొడిచేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. శివాజీ లాఘ‌వంగా త‌న చేతి కింది వాఘ్‌నఖ్‌ను బ‌య‌ట‌కు తీసి శ‌త్రువు పొట్ట‌ను చీల్చేస్తాడు. అప్పుడు శివాజీ వాడిన గోరు.. ఇప్పుడు లండ‌న్‌లో ఉన్న ఈ ఆయుధం ఒక‌టేన‌ని కొంత మంది చ‌రిత్ర‌కారుల అభిప్రాయం.




అయితే అఫ్జ‌ల్‌ఖాన్‌ను శివాజీ వాఘ్‌న‌ఖ్‌తోనే చంపిన‌ప్ప‌టికీ.. అది, మ్యూజియంలో ఉన్న‌ది ఒక‌టి కాద‌ని మ‌రికొంద‌రు పురాత‌త్వ శాస్త్రవేత్త‌ల వాద‌న‌. లండ‌న్‌లో ఉన్న‌ది శివాజీ వార‌సులు వాడిన‌ద‌ని వీరి అభిప్రాయం. అయితే ఇప్పుడున్న వాఘ్‌న‌ఖ్‌ను 1818లో పేష్వాల రాజ్యం స‌తారాలో అంత‌రించిన త‌ర్వాత బ్రిటిష‌ర్లు దీనిని స్వాధీనం చేసుకున్నార‌ని ఒక వాద‌న‌. అయితే మ‌రాఠాల చివ‌రి రాజైన ప్ర‌తాప్ సింగ్ మ‌హ‌రాజ్ త‌మ‌కు దీనిని బ‌హుమ‌తిగా ఇచ్చార‌ని ఆంగ్లేయులు చెప్పుకొంటున్నారు.

Exit mobile version