జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలో కేసులో ఎస్‌ఐ సస్పెండ్‌

జూబ్లీహిల్స్ లో 2022మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఎస్‌ఐగా ఉన్న చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

  • Publish Date - April 20, 2024 / 02:10 PM IST

కేసు రీ ఓపెన్‌తో మరో కోణం

విధాత : జూబ్లీహిల్స్ లో 2022మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఎస్‌ఐగా ఉన్న చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రాహిల్ కారు ఢీ కొట్టడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ కేసు నుంచి రాహిల్‌ను తప్పించేందుకు అప్పట్లో ఎస్‌ఐ సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల ఈ కేసును వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్‌ రీ ఒపెన్ చేశారు. కారు ప్రమాద సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదంలో రెండెళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కేసు రీ ఓపెన్ చేశాక బాధితుల స్టే‌ట్‌మెంట్‌ను పోలీసులు మరోసారి రికార్డ్ చేశారు. ఈ కేసు విచారణలో రాహిలే ప్రమాదానికి కారణం అని తేల్చారు. అయితే, పంజాగుట్ట ప్రగతి భవన్ గేట్లను ఢీ కొట్టిన కేసు మాదిరిగానే జూబ్లీహిల్స్ కేసులోనూ రాహిల్‌ను అప్పటి పోలీసు అధికారులు తప్పించారన్న వాదన తెరపైకి వచ్చింది. దీంతో కేసు రీ ఒపెన్ చేశారు. ప్రమాదం చేసిన కారు మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కానీ, ఈ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి షకీల్‌పై పోలీసులు అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోడ్డుపై బెలూన్స్ అమ్ముకొనే కుటుంబం రోడ్డు దాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

అసలేం జరిగింది..

దుర్గం చెరువు నుంచి వేగంగా వస్తున్న కారు రోడ్‌ నంబర్‌ 45 ఢివైడర్‌ను ఎక్కి చెట్టును ఢీకొట్టింది. అదే సమయంలో రోడ్డు దాటుతున్న బెలూన్స్‌ అమ్ముకునే కుటుంబంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారు ఢీకొట్టిన అనంతరం డ్రైవర్‌ పరారయ్యాడు. కారు షకీల్‌ అహ్మద్‌ అనుచరుడు మీర్జా నడిపినట్లు పోలీసులు అనుమానించారు. ప్రమాద సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు. తాజా విచారణలో ఆ కారును రాహిల్ నడిపినట్లుగా పోలీసులు తేల్చి కేసును ముందుకు నడిపిస్తున్నారు. అయితే తనపై రాజకీయ కక్షతోనే తన కుమారుడిపై ప్రభుత్వం పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తుందంటూ రాహిల్ తండ్రి షకీల్ ఆరోపిస్తున్నారు.

Latest News