Siddipet | గీత దాటిన ఉద్యోగుల సస్పెన్షన్‌

  • Publish Date - April 10, 2024 / 12:25 PM IST

సిద్దిపేటలో బీఆరెస్ సమావేశం
నిర్వహించిన ఎంపీ అభ్యర్థి
హాజరైన డీఆర్‌డీఏ ఉద్యోగులు
ఈసీ అనుమతిలేని సమావేశం
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ ఫిర్యాదు
వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు
ఉద్యోగాల నుంచి 106 మంది సస్పెన్షన్‌

విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి నాలుగు నెల‌ల‌వుతున్నా కొంత మంది స‌ర్కార్ ఉద్యోగులు ఇంకా బీఆరెస్ ప్ర‌భుత్వం ఉంద‌నే భ్ర‌మ‌లో ఉన్నట్టున్నారు. అటువంటివారు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని తాజా ఘటన రుజువు చేసింది. ఈసీ అనుమలేని సమావేశానికి, అందులోనూ ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు.

సిద్దిపేటలో ఏప్రిల్‌ 7వ తేదీన రెడ్డి ఫంక్షన్‌ హాల్లో బీఆరెస్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ఈసీ అనుమతి లేదు. బీఆరెస్‌ మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి పీ వెంకట్రామిరెడ్డి పాల్గొన్న ఈ సమావేశానికి భారీ సంఖ్యలో డీఆర్‌డీఏ ఉద్యోగులు హాజరుకావడం సంచలనం రేపింది. ఎన్నిక‌ల అధికారుల నుంచి అనుమ‌తి తీసుకోకుండా స‌మావేశం నిర్వ‌హించ‌డ‌మే కాకుండా డీఆర్‌డీఏ ఉద్యోగుల‌ను కూడా పిలిపించి, డ‌బ్బులు పంచుతున్నారంటూ మెద‌క్ బీజేపీ అభ్య‌ర్థి ఎం ర‌ఘ‌నంద‌న్ రావు జిల్లా ఎన్నిక‌ల అధికారికి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును ప‌రిశీలించి, వెంట‌నే రెడ్డి ఫంక్ష‌న్ హాలుకు సిబ్బందిని పంపించగా కొంద‌రు అక్క‌డే ఉన్నారు. ఫంక్ష‌న్ హాలు సీసీటీవి ఫుటేజ్‌ ప‌రిశీలించగా వంద మందికి పైగా డీఆర్‌డీఏ ఉద్యోగులు హాజ‌రైన‌ట్లు ఆధారాలు ల‌భించాయి. మ‌రుస‌టి రోజు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసు స్టేష‌న్‌లో బిఆరెస్ పార్ల‌మెంటు అభ్య‌ర్థి పి.వెంక‌ట్రామ్ రెడ్డి, నిర్వ‌హాకుడు మారెడ్డి ర‌వీంద‌ర్ రెడ్డిపై ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు న‌మోదు చేశారు.

కేసు న‌మోదు కావడంతో సిద్దిపేట జిల్లా ఎన్నిక‌ల అధికారి, జిల్లా క‌లెక్ట‌ర్ మ‌ను చౌద‌రి స‌మావేశానికి హాజ‌రైన ఉద్యోగుల‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మ‌రికొంత మందిని గుర్తించాల్సి ఉంది. గుర్తింపు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత మ‌రికొంద‌రిపై వేటు ప‌డ‌నున్నదని సమాచారం.

ప‌ని చేసిన జిల్లాలోనే వెంక‌ట్రామ్ రెడ్డిపై కేసు..

కే చంద్ర‌శేఖ‌ర్ రావు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పీ వెంక‌ట్రామ్ రెడ్డి సిద్దిపేట జిల్లా క‌లెక్టర్‌గా ప‌నిచేసి ఒక వెలుగు వెలిగారు. జిల్లా క‌లెక్ట‌రేట్ నూత‌న భ‌వ‌నం ప్రారంభం సంద‌ర్భంగా ఏకంగా ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసి విమర్శలపాలయ్యారు. క‌న్ఫ‌ర్డ్ ఐఏఎస్ అధికారి అయి ఉండి ముఖ్య‌మంత్రికి పాదాభివంద‌నం చేయ‌డం అవ‌మాన‌క‌ర‌మ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. త‌న‌కు కేసీఆర్‌ తండ్రితో స‌మాన‌మ‌ని, అందుకే పాదాభివంద‌నం చేశాన‌ని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పూర్తిగా సాగిల‌ప‌డి ప‌నిచేసే త‌త్వం ఆయనను దగ్గరనుంచి చూసిన అధికారులు చెబుతుంటారు. గ్రూప్ వ‌న్ అధికారిగా ఎంపికైన వెంక‌ట్రామ్ రెడ్డి తొలుత టీడీపీ ప్ర‌భుత్వంలో ప‌నిచేశారు. చంద్ర‌బాబు నాయుడుకు స‌న్నిహితంగా ఉంటూ చిత్తూరు జిల్లాలో హ‌వా న‌డిపించారు. ఆ త‌రువాత వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో హుడా సెక్రెట‌రీ గా ప‌నిచేసి ఔట‌ర్ రింగ్ రోడ్డును నాలుగు వంద‌ల వంక‌ర్లు తిప్పార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించారు. ఆ త‌రువాత తెలంగాణ ఏర్ప‌డ‌డం, బీఆరెస్‌ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డంతో కేసీఆర్‌కు స‌న్నిహితం అయ్యారు.

కేసీఆర్‌ మెప్పు కోసం నిబంధ‌న‌ల‌ను బేఖాత‌ర్ చేస్తూ ప‌నులు చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసి బీఆరెస్‌ త‌రఫున ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. తాజాగా ఆయ‌న మెద‌క్ పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా పోటీకి దిగారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వెంక‌ట్రామ్ రెడ్డిని మెదక్‌ బీఆరెస్‌ అభ్య‌ర్థిగా నిలిపారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏ జిల్లాలో క‌లెక్ట‌ర్ గా ప‌నిచేశారో అదే జిల్లాలో ఆయ‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేయడం శోచ‌నీయ‌మ‌ని విప‌క్ష పార్టీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

కేసీఆర్‌ ఫోన్‌కు స్పందించ‌ని వెంక‌ట్రామ్ రెడ్డి?

మెద‌క్ అభ్య‌ర్థిగా నిల్చోబెట్టేందుకు కేసీఆర్‌ త‌న వ్య‌క్తిగ‌త స‌హాయకుడి ద్వారా వ‌రుస‌గా ఫోన్ చేయించ‌గా వెంక‌ట్రామ్ రెడ్డి తొలుత రెస్పాండ్ కాలేదని సమాచారం. దీంతో మాజీ మంత్రి హ‌రీశ్ రావును పుర‌మాయించి త‌న వ‌ద్ద‌కు ఆయ‌న‌ను పిలిపించుకున్నార‌ని బీఆరెస్ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. కేసీఆర్‌ ఆదేశం మేర‌కు విధిలేని ప‌రిస్థితుల్లో వెంక‌ట్రామ్ రెడ్డి రంగంలోకి దిగార‌ని, ఆయ‌న‌కు ఏమాత్రం ఇష్టం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Latest News