Siraj Team Human Bombs:
దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరంలో అరెస్టయిన ఉగ్రవాది సిరాజ్ విచారణలో సంచలన విషయాలు వెలుగు చేస్తున్నాయి. ఐదురోజులుగా పోలీసులు, ఎన్‌ఐఏ సిరాజ్, సమీర్ లను విచారిస్తున్నాయి. ఈ సందర్భంగా తన అహిం గ్రూప్ కు చెందిన సభ్యుల వివరాలను సిరాజ్ వెల్లడించాడు. 20మందిని మానవబాంబులుగా తయారుచేసే క్రమంలో అహిం సభ్యులు 12మందిని ముందుగా మానవ బాంబులుగా సిద్ధం చేశారని ఎన్ఐఏ అనుమానిస్తుంది.
ప్రస్తుతం సిరాజ్, సమీర్ లను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మిగతా 10మంది కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, వరంగల్, విజయనగరం, ఢిల్లీ నగరాల్లో పేలుళ్లకు వేసిన కుట్రలపై ఎన్ఐఏ విచారణ చేస్తుంది. మొత్తం పన్నెండు మంది సభ్యులుగా అహిం ముఠాలో మిగిలిన పది మంది ఎక్కడ అన్న దానిపై ఎన్ఐఏ అధికారులు ఇప్పుడు శోధిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడైనా పేలుళ్లకు కుట్రలు జరిపారా? అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
సిరాజ్ వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహిద్దీన్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బాదర్ ను కలిసిన దానిపై, హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ ఎలా పరిచయమ్యాడు..అతను ఒమన్ లో ఉంటూ సిరాజ్ తో ఎందుకు సంబంధాలు కొనసాగిస్తున్నాడన్న దానిపైన కూడా ఎన్ఐఏ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇమ్రాన్ ఒమన్ నుంచి సిరాజ్ కు డబ్బులు పంపడం వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? లేక ఇమ్రాన్ ఒక్కడే ఈ కుట్రకు పాల్పడ్డారా? అన్న దానిపై కూడా విచారణ జరపుతున్నారు. పేలుళ్లకు కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఎంత డబ్బునైనా పంపడానికి సిద్ధమని ఇమ్రాన్ చెప్పాడంటే అతని వెనక ఎవరో ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇందులో బీహార్ కు చెంది అబూ ముసాబ్ ను కూడా ఎన్ఐఏ అనుమానిస్తుంది. సిగ్నల్ యాప్ ద్వారా వారు ఏం మాట్లాడుకున్నారన్న దానిపై నిపుణులతో విశ్లేషణ జరపాలని నిర్ణయించారు. ఈ కేసులో వీరిద్దరిని నిందితులుగా తీర్చారు. కర్ణాటకు లో గుల్బర్గాకు చెందిన సయ్యుద్దీన్ తో ఏర్పడిన పరిచయాలను సమీర్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. నిందితుల సోషల్ మీడియా ఖాతాలు, అహీం సంస్థ మూలాలు, విదేశీ ఫోన్ కాల్స్‌పై ఎన్‌ఐఎ ఆరా తీస్తుంది.