Partial Solar Eclipse | విధాత: పాక్షిక సూర్యగ్రహణం.. 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతోంది. ఈ గ్రహణాన్ని చూసేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న ఏర్పడనుంది.
కాకపోతే ఆ సమయంలో మన దేశంలో గ్రహణాన్ని వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే మన దేశంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.
మరి హైదరాబాద్‌లో కనిపించనుందా..?
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సూర్యాస్తమయానికి ఒక గంట ముందు కొన్ని నిమిషాల పాటు పాక్షిక సూర్య గ్రహణం కనిపించనున్నట్లు పేర్కొంది.
పోరుబందర్, గాంధీ నగర్, ముంబై, శిల్వాసా, సూరత్, పనాజీ ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపించ నున్నట్లు తెలిపింది. గరిష్ఠంగా ఒక గంట 45 నిమిషాల పాటు పాక్షిక సూర్యగ్రహణం కనబడుతుంది. అందులో ఎక్కువ సమయం గుజరాత్‌లోని ద్వారకాలో కనువిందు చేయనుంది. ఢిల్లీలో అయితే సాయంత్రం 4:29 గంటల నుంచి 5:30 గంటల వరకు గ్రహణం కనిపించనుంది.
హైదరాబాద్‌లో అయితే సాయంత్రం 4:59 గంటలకు గ్రహణం కనిపించనుంది. కనీసం 49 నిమిషాల పాటు కనివిందు చేయనుంది. అయితే ఈ సమయంలో 43 శాతం సూర్యుడిని అస్పష్టంగా చూడ గలుగుతామని చెప్పింది.
పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించాలనుకునే వారు తప్పనిసరిగా సోలార్ గాగూల్స్ ను ఉపయోగించాలి. ఇక ఐజ్వాల్, దిబ్రుగర్హ్, ఇంఫాల్ ఇటానగర్ కోహిమా, సిల్చార్, అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రహణం అసలే కనబడదు.