Site icon vidhaatha

Sri Rama: బియ్య‌పు గింజ‌ల‌పై శ్రీ‌రామ నామం.. పదేండ్లుగా రాస్తున్న భ‌క్తుడు

హిందువులంద‌రికీ శ్రీ‌రాముడు ఆరాధ్య దైవం. అయితే త‌మ భ‌క్తి త‌త్వాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా చాటుకుంటారు. రామ‌కోటి రాయ‌డం, శ్రీ‌రామా నామంతో సీతారాముల చిత్రాల‌ను ఒక‌రు ముగ్గుగా వేస్తే మ‌రొక‌రు పెన్నుతో రాస్తుంటారు. ఇంకొక‌రు వ‌స్త్రాల‌పై కుడుతుంటారు. ఇలా త‌మ భ‌క్తిని ప‌రిప‌రివిధాలుగా ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అలాంటి కోవ‌కు చెందిన ఒక భ‌క్తుడు బియ్య‌పు గింజ‌పై శ్రీ‌రామ నామాన్ని రాస్తూ త‌న భ‌క్తిత‌త్ప‌ర‌త‌ను తెలియ‌జేస్తున్నాడు. ఆ వివ‌రాలు తెలుసుకుందాం.

విధాత‌: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజ పట్టణంలోని తుపత్రాల ఆచార్య చక్రవర్తి స్వామి శ్రీ‌రామ భ‌క్తుడు. నిత్యం ఆయ‌న సేవ‌లో గ‌డుపుతుంటాడు. శ్రీరామనవమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని బియ్యపు గింజ పై శ్రీరామ నామాన్ని గత పది సంవత్సరాలుగా అత్యంత భక్తిశ్రద్ధలతో రాస్తున్నారు. అలాగే ఈ సారి కూడా శ్రీరామ నామాన్ని 41 రోజులుగా రాస్తూ 35వేల బియ్యపు గింజల పై వ్రాసి తన భక్తిని చాటుకున్నారు.

శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అన్నట్లుగా, ధర్మమంటే శ్రీ రాముడే.. అందరికీ ఆదర్శం ఆయ‌నే. కావున‌ భగవన్నామ స్మరణతో ప్రతి ఒక్కరూ త‌మ‌ దైనందిన కార్యక్రమాల‌ను నిర్వ‌హిస్తే ఎలాంటి అప‌జ‌యాలు ఉండవు.. అశాంతి ఉండ‌దు. అలా భగవంతుని పట్ల ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలు క‌లిగి ఉండి శ్రీ రామ నామాన్ని ఉచ్చరిస్తూ.. జీవితాన్ని సుఖ‌మ‌యం చేసుకోవాల‌ని శ్రీ ఆచార్య చక్రవర్తి తెలిపారు .

రామా అనే అక్షరంలోనే అగ్నితత్వము, సూర్య తత్వము, చంద్ర తత్వము ఉంటాయి. అందుకే శ్రీరామ నామము చాలా అద్భుతమైనది. రామా అని మ‌న‌సారా మ‌దిలో త‌లుచుకుంటే చాలు మోక్షం క‌లుగుతుంది. అంతటి మ‌హిమాన్విత‌మైన‌ది రామ నామ‌ము.

రామా అని స్మ‌రిస్తే ధైర్యం వస్తుంది. శ్రీరామా అని త‌న్మ‌య‌త్వంతో పిలిస్తే సర్వపాపాలు నశిస్తాయి. మోక్ష మార్గానికి భగవన్నామ స్మరణకు మించినది లేదు. కాబట్టి శ్రీరామ నామాన్ని నిత్యం జపిస్తుంటే అంతా మంచే జరుగుతుంది. అలాగే సకుటుంబ సపరివారంగా అందరూ కూడా ఈ శ్రీరామ నామాన్ని జపించి శ్రీ‌రాముడి ఆశీస్సులు పొందాల‌ని సూచించారు.

Exit mobile version