Malla Raji Reddy | విధాత : మావోయిస్టు నేత మల్లా రాజిరెడ్డి మృతిపై అయోమయం నెలకొంది. రాజిరెడ్డి అనారోగ్యంతో చనిపోయినట్లుగా వచ్చిన వీడియోలు, వార్తలు వాస్తవం కాదని ఇంటలిజెన్స్ వర్గాల కథనం. రాజిరెడ్డి మృతి చెందాడంటు ప్రచారమైన వీడియో గతంలో చనిపోయిన మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు హరఖ్ అలియాస్ శ్రీకాంత్ మృతి వీడియోనని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
హరఖ్ గుండె సంబంధిత వ్యాధితో 2012 ఫిబ్రవరి 26న అడవిలో చనిపోయారని, అప్పటి వీడియోనే తాజాగా రాజిరెడ్డి వీడియోగా ప్రచారమవుతుందని ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం. అదిగాక మావోయిస్టు పార్టీ నుంచి కూడా రాజిరెడ్డి మరణంపై ప్రకటన రాకపోవడంతో రాజిరెడ్డి చనిపోలేదన్న వాదనకు బలం చేకూరుతుంది. ఏది ఏమైనా రాజిరెడ్డి మృతిపై అసలు నిజానిజాలు తేల్చాల్సింది మావోయిస్టు పార్టీ నాయకత్వమేనని భావిస్తున్నారు.