Strike | సమ్మె అంటే ఉక్కుపాదం.. విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులు.!

Strike | నాడు మున్సిపల్‌, నిన్న ఆర్టీసీ, నేడు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపు పలు చోట్ల విధుల్లో చేరుతున్నట్లు రాయించుకుంటున్న అధికారులు ఇస్తే తీసుకోవాలి.. డిమాండ్‌ చేయకూడదన్న తీరుగా సర్కారు వైఖరి విధాత: ‘‘పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప’’ అని నినదించి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులు అడిగే హక్కును కోల్పోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులంతా ఐక్యమై జేఏసీలు ఏర్పాటు చేసుకొని […]

  • Publish Date - May 9, 2023 / 11:39 AM IST

Strike |

  • నాడు మున్సిపల్‌, నిన్న ఆర్టీసీ, నేడు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు
  • విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపు
  • పలు చోట్ల విధుల్లో చేరుతున్నట్లు రాయించుకుంటున్న అధికారులు
  • ఇస్తే తీసుకోవాలి.. డిమాండ్‌ చేయకూడదన్న తీరుగా సర్కారు వైఖరి

విధాత: ‘‘పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప’’ అని నినదించి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులు అడిగే హక్కును కోల్పోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులంతా ఐక్యమై జేఏసీలు ఏర్పాటు చేసుకొని ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించారు. పాలకులను ఎదిరించారు.

అలాంటి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కనీసం తమకు జీతాలు పెంచాలని, ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని అడగలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు సీఎం కేసీఆర్‌ దయదలిచి ఇస్తే తీసుకోవాలి కానీ అడుక్కోకూడదన్నతీరుగా తెలంగాణ సర్కారు పెద్దల వైఖరి ఉన్నదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజులకు మున్సిపల్‌ ఉద్యోగులు వేతనాల కోసం సమ్మె చేస్తే కనీసం కనికరించలేదు. సమ్మెకు నాయకత్వం వహించిన ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఏకంగా యూనియన్లు లేవన్నారు. నాటి మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మెను విచ్చిన్నం చేశారు. ఆ తర్వాత పీఆర్సీ అమలు చేయాలని ఉద్యమించిన ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉక్కు పాదం మోపారు.

ఏకంగా యూనియన్‌నే రద్దు చేశారు. కార్మికులపై కేసులు పెట్టారు. ఉద్యోగ సంఘం నాయకుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. గుర్తింపు సంఘాన్ని రద్దు చేశారు. ఈ సర్కారు అనుసరించిన వైఖరి ఫలితంగా ఆర్టీసీలో నేటికి కార్మిక సంఘం లేకుండా పోయింది. ఫలితంగా ఆర్టీసీలో నేడు కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

CM KCR సార్‌.. సానుకూలంగా స్పందించండి

తాజాగా తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని అడిగిన పాపానికి పంచాయతీ జూనియర్‌ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సర్కారు బెదిరింపులకు దిగింది. వాస్తవంగా పరీక్షలు నిర్వహించి 2019లో ఏప్రిల్‌లో 9,355 మందిని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమించారు. వీరికి మూడేళ్లుప్రొబిషన్‌ పిరియడ్‌ ఇచ్చారు.

ఈ గడువు ముగిసిన తరువాత అటోమెటిక్‌గా సర్కారు రెగ్యులరైజ్‌ చేయాలి కానీ, దీనికి భిన్నంగా సీఎం కేసీఆర్‌ప్రొబిషన్‌ గడువును మరో ఏడాది కాలం పొడిగించారు. ఈ మేరకు అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పెంచిన గడువు కూడా ఈ ఏడాది ఏప్రిల్‌ 11వ తేదీతో ముగిసింది. అయినా సర్కారు వీరి సర్వీస్‌ను క్రమబద్దీకరించడానికి ముందుకు రాలేదు.

దీంతో పంచాయతీ కార్యదర్శులు తమ సర్వీస్‌ను క్రమబద్దీకరించాలని, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును శాఖ కార్యదర్శిని కలిసి పలు మార్లు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ రాజ్‌శాఖలో అతిచిన్న ఉద్యోగులైన వీరికి సీఎంను కలిసే అవకాశం రాలేదు. ఏమి చేయాలో అర్థం కాక తమ సమస్యను వినిపించడానికి ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని సమ్మెకు దిగారు.

దాదాపు 12 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని సర్కారు పెద్దలు.. తాజాగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని, ఈ మేరకు అండర్‌ టేకింగ్‌ లెటర్లు రాసివ్వాలని ఆదేశించారు. కొంత మంది ఉద్యోగులను నయాన, బయాన బెదిరించి విధుల్లో చేరతామని లెటర్లు తీసుకుంటున్నారు.

ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు తమకు ఏమి కావాలో డిమాండ్‌ చేయకూడదని, అడిగితే ఇస్తే తీసుకోవాలి… ఇవ్వకుండా నోరు మూసుకొని ఉండాలి అన్న తీరుగా ఈ సర్కారు వ్యవహరిస్తున్నదని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామిక వాదులు అంటున్నారు.

Revanth Reddy | JPS సర్వీసులను క్రమబద్దీకరించకుంటే.. కాంగ్రెస్‌ పోరాటం: రేవంత్‌రెడ్డి