విధాత: డిప్యూటేషన్‌పై పంపించిన తమ పాఠశాల P.E.Tని తిరిగి మాకే కేటాయించాలంటూ విద్యార్థులు ధర్నాకు దిగిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఆరూరు గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం అరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాఠశాల ముందు బైఠాయించి మా పీఈటిని మాకు కేటాయించాలని ధర్నా నిర్వహించారు.
గత నాలుగు సంవత్సరాల క్రితం అరూర్ పాఠశాలకు చెందిన P.E.Tని మరో పాఠశాలకు డిప్యూటేషన్ పై వేశారు. అప్పటి నుంచి మా P.E.Tని మాకు కేటాయించాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న ప్పటికీ ఫలితం లేదని అందుకే పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తున్నామని విద్యార్థులు తెలిపారు.
P.E.T లేకపోవడంతో తమకు ఆటలు ఆడుకునే అవకాశం లేకుండా పోయిందని, ఆటలు విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయని చెప్పే అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ P.E.Tని తిరిగి రప్పించి పాఠశాలకు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థులు చేపట్టిన ధర్నాకు గ్రామస్తులు కూడా తమ మద్దతు తెలిపారు.