BJP | మోడీ సభ సక్సెస్ తక్షణ లక్ష్యం.. అనిశ్చితికి తాత్కాలిక పరిష్కారం

BJP తెలంగాణ బిజెపికి ప్రతిష్టాత్మకం కిషన్ రెడ్డికి తొలి పరీక్ష సభ సక్సెస్‌లో ఈటలకు వాటా నియోజకవర్గాల వారీగా కోటా ఆశావాహులకు సమీకరణ బాధ్యత పార్టీలో గ్రూపు విభేదాల బహిర్గతం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బిజెపిలో నెలకొన్న అనిచ్చితిని కొంతైనా తగ్గించాలంటే హనుమకొండలో శనివారం ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ బహిరంగ సభ విజయవంతం కావడం ప్రధానం. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర పార్టీలో నెలకొన్న విభేదాలు విమర్శలు అంతర్గత సమస్యలకు […]

  • Publish Date - July 7, 2023 / 02:02 PM IST

BJP

  • తెలంగాణ బిజెపికి ప్రతిష్టాత్మకం
  • కిషన్ రెడ్డికి తొలి పరీక్ష
  • సభ సక్సెస్‌లో ఈటలకు వాటా
  • నియోజకవర్గాల వారీగా కోటా
  • ఆశావాహులకు సమీకరణ బాధ్యత
  • పార్టీలో గ్రూపు విభేదాల బహిర్గతం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బిజెపిలో నెలకొన్న అనిచ్చితిని కొంతైనా తగ్గించాలంటే హనుమకొండలో శనివారం ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ బహిరంగ సభ విజయవంతం కావడం ప్రధానం. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర పార్టీలో నెలకొన్న విభేదాలు విమర్శలు అంతర్గత సమస్యలకు తాత్కాలికంగానైనా చెక్ పెట్టాలంటే సభ సక్సెస్ మీదనే ఆధారపడి ఉంది.

తెలంగాణ రాష్ట్ర పార్టీలో నెలకొన్న విభేదాల పరిష్కారానికి అధిష్టానం తీసుకున్న త్రిశూల వ్యూహం కొంతైనా ఫలించాలంటే ఎంచుకున్న మేరకు సభ విజయవంతమైతే విమర్శలకు పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్ర పార్టీ కొత్త నాయకత్వం పైన భరోసా సంగతి పక్కన పెడితే, కేడర్లో ఉత్సాహానికి దోహదపడుతుంది.

మోడీ చరిష్మా ఏ మేరకు పనిచేస్తుందో

ప్రధాని మోడీ చరిష్మా పనంగా పెట్టి ఈ సభ నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. పైగా ఇదే గ్రౌండ్లో నిర్వహించిన గత కాంగ్రెస్ సభకు, మొన్నటి ఖమ్మం చేరికల సభకు మించి హనుమకొండ సభ జరుగుతుందంటూ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగంగా చేసిన సవాల్ ఇప్పుడు ఆ పార్టీకి పరీక్షగానే మారింది.

ఈ సభకు ఐదు లక్షల మేరకు జన సమీకరణ చేయాలని లక్ష్యంగా చెబుతున్నప్పటికీ, సంజయ్ చెప్పిన మాటలతో లక్ష్యం 15 లక్షల జన సమీకరణగా ప్రచారం సాగుతుంది. సమయాభావం, ఆ పార్టీకున్న బలం, బలగాలను పరిగణలోకి తీసుకుంటే 15 లక్షల జన సమీకరణ అనేది అసాధ్యం. అయితే ఐదు లక్షల మేరకు జనాన్ని సమీకరించినా ఆ పార్టీ 100% విజయవంతమైనట్లేనని భావిస్తున్నారు.

బిజెపికి వరంగల్ సభ ప్రతిష్టాత్మకం

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, ఆ పార్టీ ప్రధాని హాజరవుతున్న సభగా, కేంద్రంలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న పార్టీగా, రాష్ట్రంలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటున్న ప్రత్యేక పరిస్థితులలో జరుగుతున్న వరంగల్ సభ బిజెపికి ప్రతిష్టాత్మకంగానే భావించవచ్చు.

ఒక విధంగా చావో రేవో అని పరిస్థితిని ప్రస్తుతం బిజెపి రాష్ట్రంలో ఎదుర్కొంటుంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలంటే సభ సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ పార్టీ తక్కువ సమయంలోనైనా భారీ స్థాయి జన సమీకరణ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అయితే అందులో ఏమేరకు విజయవంతం అవుతుందో అని చర్చ మాత్రం ఉంది.

కిషన్‌రెడ్డికి తొలి పరీక్ష

బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి గత అనుభవం, పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల్లో ఆయనకు హనుమకొండ సభ పరీక్ష గానే చెప్పవచ్చు. కొద్ది రోజుల సమయంలోనే సభ నిర్వహణ బాధ్యతలు ఆయన భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. పైగా పార్టీలో అంతర్గతంగా నెలకొన్న వర్గాలు వెంటనే సహకరించాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి.

సమీకరణలో ఈటలకు వాటా

కిషన్ రెడ్డి తో పాటు ఎన్నికల మేనేజ్మెంట్ చైర్మన్గా నియమించబడిన ఈటల రాజేందర్ కు కూడా ఈ సభ విజయవంతంలో వాటా తప్పనిసరి. అవునన్నా, కాదన్నా అధ్యక్షునిగా బండి సంజయ్‌ని మార్పు చేయడంలో ఈటల హస్తం కూడా ఉన్నందున, తాజా మార్పుల నేపథ్యంలో మోడీ సభను విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది. పైగా హనుమకొండ జిల్లాలోకి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం లోని రెండు మండలాలు వస్తాయి. పక్కనే ఉన్నందున జన సమీకరణ బాధ్యతలు ఆయన తీసుకోవలసిన పరిస్థితి నెలకొంది.

వరంగల్ అనువైన ప్రాంతం

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ ప్రాంతం రవాణాకు అనుకూలమైన ప్రాంతం. కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలు చుట్టూ ఉండడం కూడా కలిసొచ్చే అంశం.ఈ కారణంగానే ఖమ్మం సభ రద్దు చేసుకొని వరంగల్ లో ఏర్పాటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. దీనికి తోడు తొలి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిజెపి కొంత బలంగానే ఉంది.

దేశంలో రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న సంక్లిష్ట సమయంలో కూడా ఆ పార్టీకి హనుమకొండ నుంచి పార్లమెంటు సభ్యుడిగా జంగారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దీనికి తోడు హనుమకొండ, పరకాల, శాయంపేట నియోజకవర్గాలలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపు పొందిన సందర్భాలు ఉన్నాయి.

ఆశావహులకు సమీకరణ టార్గెట్

ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బిజెపికి ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేకున్నా, నాయకత్వ కొరత లేకుండా ఉంది ట్రై సిటీగా పేరుందిన వరంగల్ నగరంలోని తూర్పు ,పశ్చిమ నియోజకవర్గంలో బిజెపికి నాయకత్వంతో పాటు శ్రేణులు ఉన్నాయి. భూపాలపల్లి పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మానుకోట, జనగామ ప్రాంతాలలో ఆ పార్టీకి నాయకత్వం ఉంది.

ఉమ్మడి జిల్లా పరిధిలో వచ్చే ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం పనిచేస్తున్నారు. జన సమీకరణ కోసం అసెంబ్లీ ఆశావాహులకు పార్టీ అధిష్టానం కోటా కేటాయించినట్లు సమాచారం

పార్టీలో ఆధిపత్య పోరు బహిర్గతం

బిజెపిలో గ్రూపులు, ఆధిపత్య పోరు చాలాకాలంగా సాగుతున్నప్పటికీ ఎన్నికల సమీపిస్తున్నందున క్రమంగా విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. బహిరంగ దాడులు కూడా చేసుకుంటున్నారు. ఒకరంటే ఒకరు గిట్టను పరిస్థితి నెలకొంది. విభేదాలు ఉన్నప్పటికీ మోడీ సభను తమ వర్గం బలనిరూపణకు అవకాశంగా భావిస్తున్నారు.

వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ఆశావాహ అభ్యర్థులు దీనికోసం పోటీ పడుతున్నారు. వరంగల్ పశ్చిమలో రావు పద్మ, రాకేష్ రెడ్డి, ధర్మారావు వర్గాలు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. వరంగల్ తూర్పులో కుసుమ సతీష్, గంట రవికుమార్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వన్నాల వెంకటరమణల మధ్య పోటీ సాగుతోంది.

ప్రచారంలో కూడా ఎవరికి వారు రథాలు ఏర్పాటు చేసి సభపై కేంద్రీకరించి పని చేస్తున్నారు. పైకి ఒకటిగా కనిపిస్తున్నప్పటికీ లోపల ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి వరంగల్ సిటీలో నెలకొంది. ఇది ఇలా ఉండగా నర్సంపేటలో రేవూరి ప్రకాశ్ రెడ్డి , గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వర్గాలుగా విడిపోయారు. వీరిద్దరి మధ్య గురువారం జరిగిన గొడవ వల్ల రాణా ప్రతాపరెడ్డి తోపాటు ఆయన అనుచరులు నలుగురిని సస్పెండ్ చేసే వరకు వెళ్లింది.

ఇదే గ్రూపు విభేదాలు జనగామలో కూడా ఉన్నట్లు సమాచారం. గ్రూపులు ఎన్ని ఉన్నప్పటికీ మోడీ సభ నేపథ్యంలో నాయకల మధ్య ఉన్న పోటీని వినియోగించుకొని ఒక్కో నాయకునికి జన సమీకరణ లక్ష్యంగా అధిష్టానం కోటా ప్రకటించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.