- మహిళా దినోత్సవాన బహుమానం లభించిందన్న సుధామూర్తి
న్యూఢిల్లీ : ప్రముఖ వితరణశీలి, రచయిత్రి, స్ఫూర్తిదాయని సుధామూర్తిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆమె భర్త. సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ ద్వారా తెలిపారు. సుధామూర్తి పలు రంగాల్లో చేసిన విశేష కృషిని ప్రధాని కొనియాడారు.
“సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్ అవడం ‘నారీశక్తి’కి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి” అని మోదీ ఆకాంక్షించారు.
తనను రాజ్యసభకు నామినేట్ చేయడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తనకు లభించిన బహుమానమని సుధామూర్తి స్పందించారు. కన్నడ, ఆంగ్ల భాషల్లో ఆమె అనేక రచనలు చేశారు. నవలలతోపాటు, సాంకేతిక అంశాలు, ప్రయాణ అనుభూతులకు సంబంధించినవి అందులో ఉన్నాయి. నారాయణ మూర్తి, సుధ దంపతుల కుమార్తె, వెంచర్ క్యాపిటలిస్ట్ అక్షిత మూర్తి.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య.
డబుల్ సర్ప్రైజ్: సుధామూర్తి
ప్రస్తుతం థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్న సుధామూర్తి.. తనను రాజ్యసభకు నామినేట్ చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం డబుల్ సర్‌ప్రైజ్‌గా, చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. నిజానికి తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని, తాను ఏనాడూ పదవులు కోరుకోలేదని, ప్రభుత్వం నన్ను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదని చెప్పారు. దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యత అని నమ్ముతున్నానని పేర్కొన్నారు.
1950 ఆగస్ట్ 19న కర్ణాటకలోని షిగ్గావ్‌లో జన్మించిన సుధ.. కంప్యూటర్ సైంటిస్ట్, ఇంజినీర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)లో తొలి మహిళా ఇంజినీర్‌గా పనిచేసిన ఖ్యాతి గడించారు.
పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన సుధ.. పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు ఆమె చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫౌండేషన్ పేదరికం, ఆరోగ్యరక్షణ, పారిశుధ్యం వంటి అంశాలపై పనిచేస్తున్నది. ఈ ఫౌండేషన్ ద్వారా ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో వేల ఇళ్లు కట్టించి ఇచ్చారు. అనేక పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయించారు. పబ్లిక్ టాయిలెట్లు కట్టించారు. దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఆమె అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు.