లిక్కర్‌ ‘స్కాం’లో సొమ్ము ఎటుపోయిందో రేపు కేజ్రీవాల్‌ వాస్తవాలు వెల్లడిస్తారన్న ఆయన భార్య

లిక్కర్‌ స్కాంలో సొమ్ము ఎటు పోయింది? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. అయితే.. ఈ సొమ్ము ఎటు పోయిందనే విషయంలో వాస్తవాలను అరవింద్‌ కేజ్రీవాల్‌ కోర్టులో బయటపెడతారని ఆయన భార్య సునీత చెప్పారు

  • Publish Date - March 27, 2024 / 11:37 AM IST

న్యూఢిల్లీ : లిక్కర్‌ స్కాంలో సొమ్ము ఎటు పోయింది? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. అయితే.. ఈ సొమ్ము ఎటు పోయిందనే విషయంలో వాస్తవాలను అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం (28.1.03.2024) కోర్టులో బయటపెడతారని ఆయన భార్య సునీత బుధవారం (27.03.2024) చెప్పారు. కేజ్రీవాల్‌ గురువారం ఢిల్లీ హైకోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఆ సొమ్ము ఎక్కడకు పోయిందో చెప్పడమే కాకుండా.. అందుకు ఆధారాలు కూడా బయటపెడతారని ఆమె తెలిపారు.


ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను బుధవారం కలిసిన అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు సివిల్‌ లేన్స్‌లోని తమ నివాసంలో సోదాలు జరిపి 73వేల రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని సునీత తెలిపారు. ‘‘లిక్కర్‌ స్కాం’గా చెబుతున్నదానిలో ఈడీ 250కి పైగా సోదాలు నిర్వహించింది. స్కాంగా చెబుతున్న దీనిలో సొమ్ము కోసం వారు వెతుకుతున్నారు. వారికి ఇంత వరకూ అది కనిపించలేదు.


‘మార్చి 28న కోర్టులో కేజ్రీవాల్‌ అన్ని విషయాలూ బయటపెడతారు. లిక్కర్‌ స్కాం సొమ్ము ఎక్కడ ఉన్నదో ఆయన దేశం ముందు వాస్తవాలు వివరిస్తారు. అందుకు ఆధారాలు కూడా ఆయన చూపిస్తారు’ అని సునీత కేజ్రీవాల్‌ చెప్పారు. తన భర్త నిజమైన దేశభక్తుడని సాహసి, భయం లేని వ్యక్తి అని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఆయన జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన ఆత్మ మాత్రం ప్రజల మధ్యే ఉన్నదని చెప్పారు.


ఇదిలా ఉంటే.. తమ పార్టీ అధినేతను అరెస్టును సవాలు చేస్తూ, ఈడీ రిమాండ్‌ను చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఏఏపీ) దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కూడా ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ మార్చి 28తో ముగియనున్నది. తన ప్రాథమిక హక్కులను, మానవ హక్కులను దర్యాప్తు సంస్థ ఉల్లంఘించిందని, అరెస్టు సమయంలో తన నేరాన్ని రుజువు చేయలేక పోయిందని కేజ్రీవాల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.


సునీత వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ.. ‘లాలు ప్రసాద్‌ యాదవ్‌ పశుగ్రాసం కేసులో అరెస్టయినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి ప్రకటనలు చేసేవారు. క్రమంగా ఆయన కుర్చీని ఆక్రమించారు’ అని వ్యాఖ్యానించారు.

Latest News