Site icon vidhaatha

Supreme Court | క్రిమినల్‌ కేసులుంటే స్వీపర్‌ కొలువు రాదు కానీ.. మంత్రులు కావొచ్చు..! సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court | అవినీతికి సామాన్యులు బలవుతున్నారని, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచాలు ఇవ్వందే పని జరుగడం లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతిని అరికట్టేందుకు అన్ని స్థాయిల్లో జవాబుదారీతనాన్ని తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. క్రిమినల్‌ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ వాదనలు వినిపించగా.. వేధింపులు, హత్య, కిడ్నాప్‌లాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి స్వీపర్‌, పోలీస్‌ కాలేడని.. కానీ క్రిమినల్‌ కేసుల్లో ఉన్న వ్యక్తి మాత్రం మంత్రి కావొచ్చని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.

ఈ మేరకు ఈ పిల్‌పై స్పందన తెలుపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉపాధ్యాయ్‌ వాదనలు వినిపిస్తూ.. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్నామని, కిడ్నాప్‌లు, దోపిడీ ఆరోపణలున్న వ్యక్తి ఇంకా ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. కష్టపడే దేశంగా మారాలంటే.. మనం విలువలు పాటించాలన్నారు. ఆస్తులకు ఆధార్‌తో లింక్‌ చేయాలన్నారు. దేశంలో చాలా మందికి క్రెడిట్‌కార్డ్‌, డెబిట్‌కార్డులు ఉన్నందున రూ.500, రూ.2వేల నోట్లు అవసరం లేదన్నారు. నోట్లపై నిషేధం ఉండాలని, మార్పిడిపై కాదన్నారు. పిల్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 10న మరోసారి విచారించనున్నది.

ఇంతకు ముందు సైతం క్రిమినల్‌ కేసులున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ విషయంలో స్పందన చెప్పాలని కేంద్ర న్యాయశాఖ, హోంమంత్రిత్వ శాఖలతో పాటు ఎన్నికల సంఘాన్ని సైతం కోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించాలని కేంద్ర న్యాయశాఖ, కేంద్ర హోంశాఖలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. తీవ్రమైన నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని లా కమిషన్ తన 244వ నివేదికలో తెలిపిందని కోర్టుకు తెలిపారు.

క్రిమినల్‌ కేసుల్లో ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేవారి సంఖ్య పెరగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 17వ లోక్‌సభలో గెలిచిన 539 మందిలో 233 మంది (43 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత, 185 (34 శాతం) మంది క్రిమినల్ తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో తెలిపారు. నేర నేపథ్యం ఎక్కువగా ఉన్నవారికే.. ఎన్నికల్లో విజయావకాశాలు అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని, ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలపై పార్టీలు ఆధారపడడం పెరిగిపోతోందని, వారికే టికెట్లు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయంటూ పిటిషనర్‌ అయిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version