న్యూఢిల్లీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ పేరుతో రూ.25వేల కోట్ల కుంభకోణం చేస్తోందని, అవినీతి సొమ్ము మూటలను ఢిల్లీకి పంపిస్తుందనిగతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. కేసుని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పు కేటీఆర్‌కు అనుకూలంగా రావడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో తన స్పందన తెలియచేయాలని కేటీఆర్ ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.