Site icon vidhaatha

Suryanarayana | ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సస్పెన్షన్

Suryanarayana

విధాత‌: జగన్ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారి తరచూ ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సహ ఉద్యోగులతో కలిసి అయన వ్యాపారుల, హోల్ సేల్ వ్యాపారుల నుంచి లంచాలు మింగేసి ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టేలా చేశారనే అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు.

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో 2023, మే 30న రిజిస్టర్ అయిన ఓ కేసులో సూర్యనారాయణ ఐదో నిందితుడిగా ఉన్నారు. 2019 -2021 మధ్య కేఆర్‌ సూర్యనారాయణ, మెహర్ కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణలతో కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని అభియోగాలు నమోదైనాయి. సూర్యనారాయణ మినహా మిగతా నలుగురిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించగా.. ఏ-5 సూర్యనారాయణతో కలిసి వారు కుట్ర చేసిన వివరాలు వారు వెల్లడించారు.

ఏపీ కమర్షియల్ ట్యాక్స్ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సూర్యానారాయణ, మిగతా నలుగురు కలిసి తనిఖీల పేరిట వ్యాపారులను బెదిరించి భారీగా వసూలు చేసినట్లు విచారణలో తేలింది. సూర్యనారాయణ ఉద్యోగంలో కొనసాగితే విచారణ సజావుగా సాగదని ప్రభుత్వనికి కూడా హాని కలిగే అవకాశం ఉందంటూ ప్రొసీడింగ్స్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే విచారణకు సహకరించకపోవడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యనారాయణపై క్రమశిక్షణా చర్యలు పూర్తిగా తీసుకునే వరకూ సస్పెన్షన్ ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రొసీడింగ్స్‌ను విడుదల చేశారు. సస్పెన్సన్ కాలంలో అయన విజయవాడను వదిలి వెళ్లరాదని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version