Site icon vidhaatha

Suryapeta | శరవేగంగా పట్టణ సుందరీకరణ పనులు.. మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణ

Suryapeta

విధాత: సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సారథ్యంలో గ్రీన్ టౌన్‌గా రూపుదిద్దుకుంటున్న సూర్యాపేట పట్టణంలో సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని మెడికల్ కాలేజ్, సద్దుల చెరువు మినీ టాంక్ బండ్ వద్ద చేపట్టిన పనులను మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

ఇప్పటికే గ్రీనరీతో పూర్తైన ఐ లవ్ సూర్యాపేట, తెలంగాణ వంటి గ్రీనరీ బోర్డ్ లు సెల్ఫీ పాయింట్లు గా మారిపోయాయి. టాంక్ బండ్ నుండి హైవే వరకు చెరువు కట్ట పొడవునా దిగువన ఏర్పాటు చేసిన రక రకాల పూల మొక్కలు వాహనదారులను కనువిందు చేస్తున్నాయి. దాదాపు పట్టణంలో రెండు గంటల పాటు పర్యటించిన మంత్రి, ఎన్టీఆర్ చౌరస్తా, జనగాం క్రాస్ రోడ్స్ లో ఆధునికరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

పచ్చదనం ఉట్టిపడేలా చౌరస్తాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా దెబ్బతిన్న ఎన్టీఆర్ పార్క్ వద్ద గల రహదారులను వెంటనే మరమ్మత్తు చేయాలని అధికారులు సూచించారు. మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థుల కోసం, వారికి ఇబ్బందులు తలెత్తకుండా మరో గేటును ఏర్పాటు చేయాలని సూచించారు.

సాధ్యమైనంత తొందరగా నాణ్యతతో కూడిన గ్రీనరీ పనులను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. సూర్యాపేటను దేశంలోనే నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దడానికి జరుగుతున్న యజ్ఞంలో అధికారులకు తోడుగా ప్రజలు కూడా భాగస్వాములు కావాల‌ని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

Exit mobile version