Tatikonda Rajaiah | కాంగ్రెస్‌లోకి తాటికొండ రాజయ్య? రాజనర్సింహతో రహస్య భేటీ

Tatikonda Rajaiah | హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఘన్‌పూర్‌ టికెట్‌ ప్రస్తావన? బీఆరెస్‌లో దక్కని అవకాశం కొన్ని రోజులుగా అసంతృప్తిలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్‌ఘన్‌పూర్‌ సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ముఖ్యనేత దామోదర రాజనర్సింహతో హైదరాబాద్‌లోని ఒక హోటల్లో ఆయన రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. సమావేశంలో ఏం చర్చ జరిగిందనేది ఇంకా తెలియనప్పటికీ […]

  • Publish Date - September 4, 2023 / 02:14 PM IST

Tatikonda Rajaiah |

  • హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో
  • ఘన్‌పూర్‌ టికెట్‌ ప్రస్తావన?
  • బీఆరెస్‌లో దక్కని అవకాశం
  • కొన్ని రోజులుగా అసంతృప్తిలో
  • కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్‌ఘన్‌పూర్‌ సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ముఖ్యనేత దామోదర రాజనర్సింహతో హైదరాబాద్‌లోని ఒక హోటల్లో ఆయన రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. సమావేశంలో ఏం చర్చ జరిగిందనేది ఇంకా తెలియనప్పటికీ టికెట్ గ్యారెంటీ గురించి రాజయ్య ప్రస్తావించినట్లు చెబుతున్నారు.

పేరు లేకపోవడంతో రాజయ్య తీవ్రమనస్థాపం

బీఆరెస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రాజయ్య పేరు లేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భోరున విలపించారు. అయినా.. కేసీఆర్‌పై తనకు నమ్మకం ఉన్నదంటూనే తనదైన పద్ధతిలో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ, ప్రజా జీవితంలోనే ఉంటానంటూ ప్రకటిస్తూ వచ్చారు.

ఒక దశలో జాబితాలో మార్పు ఉంటుందనే ఆశాభావంతో ఉన్నారు. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవన్న వాదనలు ఆయన అనుచరుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయాలని, అవసరమైతే పార్టీ మార్పునకు కూడా సిద్ధపడాలని అనుచరులు ఒత్తిడి పెంచడంతో ఆయన కూడా పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి సానుకూల సంకేతాలు రాజయ్యకు అందాయని తెలుస్తున్నది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండి, అదే సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహతో రాజయ్య భేటీ జరిగినట్టు వార్తలు గుప్పుమనడం రాజకీయంగా సంచలనం రేపింది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రాజయ్యను రాజనర్సింహ ఆహ్వానించినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో సముచిత స్థానం దక్కే విధంగా కృషి చేస్తానని రాజనర్సింహ చెప్పినట్లుగా రాజయ్య అనుచరులు అంటున్నారు.

అయితే ఎన్నికల్లో పోటీకి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆ పార్టీలో చేరేందుకు రాజయ్య మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా త్వరలో గులాబీ పార్టీకి రాజయ్య టాటా చెప్పేందుకు సిద్ధమైనట్లుగా ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఈ విషయంలో రాజయ్య ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా రాజయ్య పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో అనే చర్చ సాగుతుంది. మరోవైపు ఈరోజు మంత్రి ఎర్రబెల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం వల్మిడిలో జరిగిన కార్యక్రమానికి రాజయ్య హాజరు కావడం గమనార్హం.

రాజయ్యకు మద్దతుగా కృష్ణమాదిగ

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మందకృష్ణ మాదిగ రాజయ్యకు మద్దతుగా నిలబడుతున్నారు. నియోజకవర్గంలో 70 వేలకు పైగా మాదిగల ఓట్లు ఉన్నందున, ఆ సామాజిక వర్గానికి చెందిన రాజయ్యను బరిలో నిలపాలని కృష్ణ మాదిగ భావిస్తున్నారు.

దీనికి తోడు ప్రధాన రాజకీయ పార్టీ అండగా ఉంటే రాజయ్య గెలుపు సులభం అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కడియం శ్రీహరిపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీహరి ఓటమి లక్ష్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు రాజయ్యకు దక్కే విధంగా కృషి చేయాలని ఆశిస్తున్నారు.

Latest News