Site icon vidhaatha

Karnataka | పాకిస్తాన్‌కు వెళ్లిపోండి.. ముస్లిం స్టూడెంట్స్‌ను దూషించిన‌ టీచ‌ర్

Karnataka |

క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ టీచ‌ర్.. వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్‌కు వెళ్లిపోండ‌ని ఓ ఇద్ద‌రు ముస్లిం విద్యార్థుల‌ను టీచ‌ర్ దూషించారు. టీచ‌ర్ వ్యాఖ్య‌ల‌పై విద్యార్థుల త‌ల్లిదండ్రులు విద్యాశాఖ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు.

క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ జిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఇద్ద‌రు ముస్లిం విద్యార్థులు గొడ‌వ‌ప‌డ్డారు. దీంతో క‌న్న‌డం బోధించే టీచ‌ర్ తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యారు. క్లాస్ రూమ్‌లో గొడ‌వ ఏంట‌ని ప్ర‌శ్నించారు. మీరు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాల‌ని.. ఇది హిందువుల దేశ‌మ‌ని స‌ద‌రు టీచ‌ర్ విద్యార్థుల‌పై మండిప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న‌పై బ్లాక్ ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ బీ నాగ‌రాజు స్పందించారు. విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌న్నారు. విద్యార్థుల‌ను దూషించిన టీచ‌ర్‌ను మ‌రో స్కూల్‌కు బ‌దిలీ చేశామ‌ని తెలిపారు.

ఆమె వ్యాఖ్య‌ల‌పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని, ద‌ర్యాప్తు పూర్త‌యిన త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. గ‌త ఎనిమిదేండ్ల నుంచి ఉర్దూ స్కూల్‌లో క‌న్న‌డ టీచ‌ర్‌గా ఆమె ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు. ఆమె రెగ్యుల‌ర్ ఉద్యోగిని కాగా, టీచింగ్‌లో 26 ఏండ్ల అనుభ‌వం ఉంద‌న్నారు.

Exit mobile version