విధాత: శత్రువులను ఎదుర్కోవాలంటే మిత్రులను జతకట్టుకోవాలని అల్ ఇండియా కిసాన్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అన్నారు. నల్లగొండలోని మల్లు స్వరాజ్యం నగర్, మాది పురుషోత్తం రెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో జరుగుతున్నతెలంగాణ రైతు సంఘం రెండో మహాసభ ముగింపు సందర్భంగా మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
కలిసి పనిచేసి పోరాడితేనే ఐక్యత..
తెలంగాణ ఉద్యమం దక్షిణ భారతదేశంలో కీలకమైన ఉద్యమం అని కొనియాడారు. ప్రతి సంవత్సరానికి ఓ సారి గ్రామాలలో సభ్యత్యాలు పూర్తి చేసి గ్రామసభలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి రైతును సంఘంలో సభ్యునిగా చేర్చుకొని రైతు సంఘం ప్రతి గ్రామంలో ఉండేటట్టుగా చూడాలన్నారు. గ్రామాలలో 10 శాతం రైతులను సంఘంలో చేర్చేలా ముందుకు సాగాలని కోరారు. కేరళ రాష్ట్రంలో ఒకే వారంలో 57 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు.
గ్రామాలలో ప్రతి సంవత్సరం సభ్యత్వాలు పూర్తైన తర్వాత గ్రామ కమిటీలను వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. గ్రామ కమిటీలు ప్రతి రైతుతో సంబంధం పెట్టుకొని జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించాలన్నారు. నినాదంతో ఐక్యత రాదని కలిసి పనిచేసి పోరాడితే ఐక్యత వస్తుందని అన్నారు. రైతు నాయకులు ప్రణాళిక బద్దంగా ఉండి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. అందరూ ఏకమై కార్పొరేట్ కమ్యూనిల్ ప్రభుత్వాన్నిసమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
రైతులు సంఘటిత పోరాటాలు చేయాలి: మల్లారెడ్డి
ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులన అమలు కోసం రైతాంగం సంఘటిత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం రైతులకు ఉపయోగ కరంగా మారాలంటే ప్రభుత్వ విధానాలు మారాలన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిందన్నారు. వరి సాగు లాభసాటిగా లేక పోవటంతో రైతులు వరిసాగు పట్ల ఆసక్తి చూపటం లేదని చెప్పారు.
ప్రతి గ్రామంలో రైతులతో కమిటీలు ఏర్పాటుచేసి సమస్యల పరి ష్కారానికి పోరాటానికి సన్నద్ధం కావాలన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. అదేవిధంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ పతనం ఖాయమని అన్నారు. కేంద్రం వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం అనేక చట్టాలను తెచ్చిందని, వాటిని అమలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
గిట్టుబాటు ధరపై అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. తాము రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పడమే గానీ.. ఆచరణలో చేసిందేమీ లేదన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలను అడ్డగోలుగా పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్ కారణంగా రైతులకు నేటికీ పాస్‌పుస్తకాలు అందక రైతుబంధు, రైతుబీమా పథకాలను నోచుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు ఏకమవ్వాలి: నంద్యాల
రైతులు ఏకమైతే మోడీ ప్రభుత్వం పతనం తథ్యమని నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. దేశంలోని రైతులు, రైతు సంఘాలు ఏకమైతే మోడీ ప్రభుత్వం పతనం ఖాయమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటు శక్తులకు దేశాన్ని అప్పజెప్పే ఉద్దేశంలో మోడీ సర్కార్ పనిచేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తూ ప్రజలకు మరింత ఆర్థికంగా క్షోభ కలిగిస్తుందని మండిపడ్డారు.
పోడు భూములపై హక్కులు ఇవ్వాలి: శ్రీరామ్ నాయక్
గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ దేశంలో ఇన్నిరోజులు లేనివిధంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు గిరిజనులు నూటికి 80% సన్న, చిన్న కారు రైతులు గానే మిగిలిపోయారని అన్నారు. రాష్ట్రంలో మెట్ట పంటలకు ఆదరణ తగ్గిందని అన్నారు.
తండాలలో ఆధారం లేక గిట్టుబాటు తగ్గడంతో గిరిజన రైతులు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూముల రైతులకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహాసభలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, రైతు సంఘం మహిళ రైతు రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, శెట్టి వెంకన్న, వల్లపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, బండ శ్రీశైలం, సహాయ కార్యదర్శి మూడు శోభన్, మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఆవాజ్ రాష్ట్ర నాయకులు సయ్యద్ హాషం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.