NEET EXAM | Telangana
విధాత,ఖమ్మం: మెడిసిన్ చదవాలన్న తపనతో 49 ఏళ్ల ఓ వ్యక్తి తన కుమార్తెతో కలిసి నీట్ పరీక్ష రాయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన రాయల సతీశ్ బాబు ఓ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఆయనకు మెడిసిన్ చదవాలని ఉన్నప్పటికీ వయసు మీరిపోవడంతో మిన్నకుండిపోయారు.
తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నీట్ పరీక్షకు వయసు పరిమితిని తొలగించడంతో సతీశ్ బాబు పరీక్షకు సన్నద్ధమయ్యారు. అయితే బీటెక్ పూర్తి చేసిన ఆయన ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపు చదివారు. నీట్ రాయడానికి జువాలజీ, బోటనీ తప్పనిసరి కావడంతో ఇంటర్ బోర్డు వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ ఏడాది ఆ రెండు సబ్జెక్టుల ఇంటర్ పరీక్షలను రాసి ఉత్తీర్ణులయ్యారు.
ఇదే ఏడాది ఆయన కుమార్తె జోషిక స్వప్నిక నీట్ రాయనుండటంతో ఇద్దరూ కలిసి ప్రిపేర్ అయినట్లు సతీశ్ తెలిపారు. నీట్ క్లియర్ చేస్తానని గట్టి నమ్మకం ఉందని, ఒక వేళ రాకపోయినా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఎలాగైనా నీట్ పాస్ అవుతానని చెప్పారు. డాక్టర్ అయి హాస్పటల్ నిర్మించాలన్నదే తన ధ్యేయమని చెప్పుకొచ్చారు. మెడిసిన్, ఆయుష్ బీడీఎస్ ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష.. ఆదివారం జరుగుతున్న విషయం తెలిసిందే.