Telangana |
విధాత: తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
గురుకులాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ
సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.దీంతో 567మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు రెగ్యులైజ్ కానున్నారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. తద్వారా 16ఏళ్లుగా కాంట్రాక్టు పద్దతిలో కొనసాగుతున్న సదరు ఉపాధ్యాయులకు ఉపశమనం లభించనుంది.
బీ.ఎడ్., డీ.ఎడ్ అభ్యర్థుల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల టీచర్ పోస్టులే భర్తీ చేస్తామన్న ప్రకటనపై బీ.ఎడ్. ,డీ.ఎడ్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్టు 13,500 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ఈ డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని కోరారు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కంటితుడుపుగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.