Site icon vidhaatha

Talasani | కేటీఆర్‌ సమక్షంలో.. బైంసా మార్కెట్ చైర్మన్‌ను చెంపదెబ్బ కొట్టిన మంత్రి తలసాని

Talasani |

సోషల్ మీడియాలో రచ్చ.. గిరిజనుల నిరసనలు

విధాత: హైద్రాబాద్‌లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరిగిన స్టీల్ బ్రిడ్జీ ప్రారంభోత్సవం బైంసా మార్కెట్ చైర్మన్‌, గిరిజన నేత రాజేశ్ బాబుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్టీల్ బ్రిడ్జీ ప్రారంభోత్సవం కోసం మంత్రి కేటీఆర్ భద్రత సిబ్బందితో, పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముందుకెళుతున్నారు.

ఈ సందర్భంలో కేటీఆర్ వెనుక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెలుతున్న క్రమంలో ఆయనను దాటి రాజేశ్ బాబు ముందుకెళ్లగా ఒక్కసారిగా తలసాని కోపంతో అతడిని వెనక్కి లాగిపారేసి, చేయి చేసుకున్నారు. ఈ హఠాత్ పరిణామానికి ఖిన్నుడైన రాజేశ్ బాబు తేరుకునే లోపునే మంత్రులు ముందుకెళ్లడంతో జరిగిన సంఘటనను పక్కన పెట్టి అతను కూడా వారితో పాటు సాగాడు.

అయితే మంత్రి తలసాని దురుసు ప్రవర్తన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో గులాబీ నేతల అంతర్గత పోరు రచ్చకెక్కినట్లయ్యింది. గిరిజన నేత రాజేశ్‌బాబు పట్ల మంత్రి తలసాని దౌర్జన్యాన్ని నిరసిస్తు బైంసా పట్టణంలో గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తలసాని ఫ్లెక్సీలకు చెప్పుల దండ వేసి, చెప్పులతో కొట్టి దగ్ధం చేసి నిరసన తెలిపారు.

బాధ్యాతయుతమైన మంత్రి హోదాలో ఉండి తలసాని ప్రవర్తించిన తీరు సమంజసంగా లేదంటు విమర్శించారు. మంత్రి వెంటనే ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.

Exit mobile version