TET | తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నిర్వహించేందుకు విద్యావాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో టెట్ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి 101 రోజుల సమయం పడుతుందని విద్యాశాఖ అంచనా వేసింది.
నోటిఫికేషన్ జారీ, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, ఇతర ప్రక్రియలకు 80 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. పరీక్ష ముగిసిన తర్వాత ఫలితాల వెల్లడికి 21 రోజులు పడుతుంది. మొత్తంగా 101 రోజుల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే టెట్ నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పరీక్ష నిర్వహణకే 80 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో టెట్ సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
ప్రత్యక్ష ఉపాధ్యాయ ఖాళీలు 9,730
టెట్ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యక్ష ఉపాధ్యాయ ఖాళీలు 9,730 ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తేల్చారు. ఈ ఖాళీలు కాక, పదోన్నతుల ద్వారా 9,314 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుందని తెలిపింది.
టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించి, కొత్త టీచర్లు వచ్చే వరకు, పదోన్నతులు కల్పించే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుందని విద్యాశాఖ ప్రతిపాదించింది. ప్రత్యక్ష ఉపాధ్యాయ ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. 2,179 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,360 ఎస్‌జీటీలు, 669 భాషా పండితులు, 162 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.