Thailand | సమయానికి మించి పని చేయిస్తున్నాడని.. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడనే కోపంతో ఓ సెక్యూరిటీ గార్డు తన యజమానిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన థాయిలాండ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అరోమ్ బున్నాన్(56) వద్ద సావత్(44) అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి యజమాని తన సెక్యూరిటీ గార్డుతో సమయానికి మించి పని చేయిస్తున్నాడు. అంతే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి, మానసికంగా వేధిస్తున్నాడు. యజమాని వేధింపులు భరించలేకపోయాడు సావత్. దీంతో అరోమ్ ఛాతీపై కత్తితో పొడిచి చంపాడు సెక్యూరిటీ గార్డు. ఈ కేసులో సావత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా సావత్ మాట్లాడుతూ.. గత కొంత కాలం నుంచి తమ బాస్‌పై కోపంగా ఉన్నాను. అతని తిట్లకు రాత్రి పూట నిద్ర కూడా పట్టడం లేదు. తనను అసభ్య పదజాలంతో దూషించేవాడని తెలిపాడు. తాను ఇంట్లో ఉన్నా కూడా ఆ పదాలే తన మెదడులో గిర్రున తిరిగేవి అని సావత్ పేర్కొన్నాడు.
అయితే అరోమ్‌ను సావత్ కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరం రుజువైతే సావత్‌కు 20 ఏండ్ల జైలు శిక్ష పడనుంది.