Site icon vidhaatha

సమగ్ర విధానంతో పంటల వైవిధ్యం సాధ్యమే

రాష్ట్రంలో పంటల వైవిధ్యం అంతంత మాత్రంగానే ఉన్నదని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. రెండు, మూడు జిల్లాల్లో రైతులు రెండు, మూడు పంటలకే పరిమితమౌతున్నారని పేర్కొన్నది. రాష్ట్రంలోని 80 శాతం విస్తీర్ణంలో పది పంటలే. మిగిలిన 20 శాతంలో 67 రకాల పంటలు పండుతాయని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో చెప్పింది.


రాష్ట్రంలో రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లపోవడానికి కారణాలు ఏమిటి? గతంతో పోలిస్తే సాగునీటి, విద్యుత్‌ సౌకర్యం మెరుగైనా ఇంకా రెండు మూడు పంటలు పండించడానికే రైతులు మొగ్గుచూపడానికి కారణాలను తెలుసుకోవడానికి వ్యవసాయ నిపుణులను సంప్రదిస్తే అనేక విషయాలు వెల్లడయ్యాయి. అవి ఏమిటో చూద్దాం.


 


రాష్ట్రంలో 85 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. కనీస మద్దతు ధర భరోసా ఉన్న పంటలకు మాత్రమే రైతులు మొగ్గుచూపుతున్నారు. ఇందులో అపరాలు, నూనె గింజలు, వరి, మక్కజొన్న, రాగి వంటి పంటలకు వానకాలం, యాసంగిలో కేంద్రం మద్దతు ధరలు ఇస్తున్నది. అందుకే రైతులు ఈ పంటలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.


సేకరణ కేంద్రాలే కీలకం


ఈ-నామ్‌ ద్వారా రైతులు ఎక్కడ ఎక్కువ ధర ఉంటే అక్కడ పంటలు అమ్ముకోవచ్చు కేంద్రం చెబుతున్నది. కానీ రవాణ సౌకర్యాలు, చిన్న, సన్నకారు రైతులు పండించే కొద్ది మిగులును రాష్ట్రాలు దాటి అమ్ముకునే పరిస్థితి ఉండదు. దీనివల్ల రైతులకు రవాణా భారం, అదనపు ఖర్చులే తప్పా వారికి ఒనగూరే ప్రయోజనం ఉండదు. సీసీఐ పత్తి, ఎఫ్‌సీఐ ధాన్యాలు, మక్కజొన్న, తృణధాన్యాలను మండలాలు , గ్రామాల వారీగా సేకరిస్తున్నాయి. రైతులు ఈ పంటల సాగుకే పరిమితం కావడానికి ఇది ఒక కారణం.


అపరాలకు డిమాండ్‌ ఉన్నా


అపరాలకు (కంది, పెసర, మినుము పంటలు) మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ ఎకరానికి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుంది. ఈ పంటలు సాగు చేయాలంటే రైతులకు ఎక్కువ భారం అవుతుంది. దీనికి తోడు ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే రైతులకు లాభసాటిగా ఉంటుంది. రైతులు అపరాల పంటల సాగు వైపు మొగ్గుచూపాలంటే ఎరువులు, విత్తనాలకు సబ్సిడీ అందించాలి. దీనివల్ల ఖర్చు భారం తగ్గుతుంది. అప్పుడు రైతులు ఆ పంటల సాగు చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉన్నది.


ఉద్యాన పంటలతో ఏడాదంతా ఆదాయం


ఉద్యాన పంటల్లో తోటల పంటల కంటే ముఖ్యంగా కూరగాయల సాగు వల్ల ఏడాదంతా రైతులకు ఆదాయం లభిస్తుంది. కుటుంబానికి ఏడాదంతా పని దొరుకుతుంది. అయితే ఈ పంటలు సాగు చేయాలంటే విత్తనాల ధర ఎక్కువగా ఉంటుంది. ఈ విత్తనాలు ప్రైవేట్‌ కంపెనీలు సరఫరా చేస్తుండటం ఈ ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం. ఈ పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం విత్తనాలను సబ్సిడీ కింద అందించాలి.


 


కూరగాయలను అమ్ముకోవడానికి మార్కెట్‌ ఇబ్బంది లేదు. హైదరాబాద్‌ లాంటి మార్కెట్‌ కు తెలంగాణ నుంచి 40 శాతం మాత్రమే వస్తండగా, మిగిలి 60శాతం ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. కాబట్టి రాష్ట్ర అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులును ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తే రానున్న రోజుల్లో కూరగాయల కొరత తీరడంతోపాటు రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది.


స్థానిక పరిస్థితుల ఆధారంగా పంటల సాగు


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరికి అదనంగా 500 రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది ఆహ్వానించదగినదే. అయితే దీనితోపాటు స్థానిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంటల సాగును ప్రోత్సహించాలి. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్ నగర్‌జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో నల్ల బూజు లేని నాణ్యమైన పల్లి పంట పండుతుంది. ఆసియా ఖండంలోనే నాణ్యమైన పల్లి ఇక్కడ సాగవుతున్నది. ఇది ఎగుమతి కూడా అనుకూలం. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు ప్రాంతంలో కంది తోపాటు కూరగాయల సాగు చేస్తారు. రంగారెడ్డిలో ఉన్న మార్కెట్ లను అధ్యయనం చేయాలి.


అక్కడ స్థానిక అవసరాలు తీరడంతో పాటు ఇతర చోట్లకు ఎగుమతి చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలి. నిజామాబాద్‌లో పసుపు, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో సోయాబీన్‌ విరివిగా సాగు చేస్తారు. ఈ పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పరిస్థితులను, సాంకేతిక కారణాల వంటివి వ్యవసాయ నిపుణులతో అధ్యయనం చేయించి, వారి సూచనలు, సలహాలకు అణుగుణంగా ఒక సమగ్ర పంటల విధానాన్ని రూపొందించాలి. అప్పుడు పంటల వైవిధ్యం పెరగడం అసాధ్యమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలని వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు, రైతులు కోరుతున్నారు.


(ఆసరి రాజు)

Exit mobile version