Andaman
- పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన సీలింగ్ పాల్స్
- ఈదురుగాలులకు దెబ్బతిన్న పైకప్పు
- స్పందించిన పౌర విమానయానశాఖ మంత్రి
విధాత: అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో నిర్మించిన వీర సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈదురు గాలులకు పైకప్పు దెబ్బతిన్నది. సీలింగ్ పాల్స్ కొన్ని ఊడి కిందపడిపోగా, మరికొన్నిప్రమాదకరంగా వేలాడుతున్నాయి.
షెల్ ఆకారంలో ఉన్న విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గతవారమే ప్రారంభించారు. పైకప్పు దెబ్బతిన్న ఫొటోలు, వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నాసిరకంగా పనులు చేపట్టడం మూలంగా కొన్నిరోజులకే పైకప్పు ధ్వంసంమైందని పలువురు నెటిజన్లు విమర్శించారు.
ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది. సీసీటీవీ పనులు, అలైన్‌మెంట్‌ల సర్దుబాటు కోసం సీలింగ్ కొంత భాగాలన్ని వదిలేయడంతో శనివారం వీచిన బలమైన ఈదురుగాలులకు ఫాల్స్ సీలింగ్ దెబ్బతిన్నదని తెలిపింది. టెర్మినల్ భవనం లోపల ఫాల్స్ సీలింగ్ చెక్కుచెదరకుండా ఉన్నదని, టెర్మినల్ లోపల ఉన్న ఏ ఇన్‌స్టాలేషన్‌లకు ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొన్నది.
Not so good news … the ceiling of the new Veer Savarkar International Airport drops. #Andaman pic.twitter.com/yhjUOnXfQF
— Andaman Chronicle (@AndamanNews) July 23, 2023
సీలింగ్ పాల్స్ వేలాడుతున్న ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ట్విట్టర్‌లో స్పందించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలోని ఫాల్స్ సీలింగ్ దెబ్బతిన్నదని తెలిపారు. సీసీటీవీ ఏర్పాటు పనులు పూర్తయిన తర్వాత ఫాల్స్ సీలింగ్‌ను మళ్లీ బిగించినట్టు మంత్రి పేర్కొన్నారు.
రూ.710 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విశాలమైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం దాదాపు 40,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. ఏటా 50 లక్షల మంది ప్రయాణికులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. అండమాన్, నికోబార్ దీవుల పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొత్త టెర్మినల్ కేంద్రం నిర్మించింది.