విధాత : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాహణపై తలెత్తిన వివాదం పరిష్కారం లక్ష్యంగా ఈ నెల 8న కేంద్రం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లుగా కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. తుఫాన్ కారణంగా 4వ తేదీ బుధవారం నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని 8వ తేదీకి మార్చినట్లుగా వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు 8వ తేదీన జరిగే సమావేశానికి స్వయంగా హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఇప్పటికే కేంద్ర సీఆర్‌పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నవంబర్ 30వ తేదీన డ్యాంపై ఏపీ పోలీసుల దాడి, కుడికాలువకు బలవంతంగా నీటి విడుదల, ఏపీ పోలీసులు అడ్డుకోవడం, పరస్పర పోలీసు కేసుల పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలకు దారితీశాయి. దీంతో కేంద్రం జోక్యం చేసుకుని కృష్ణానది యాజమాన్యబోర్డు(కేఆర్‌ఎంబీ) పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ వాటి అనుబంధ ప్రాజెక్టుల నిర్వాహణపై చర్చించి పరిష్కారం లక్ష్యంగా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
ఈ సందర్భంగా సాగర్ ప్రాజెక్టును కేంద్ర బలగాల భద్రత పరిధిలోకి తీసుకొచ్చింది. ఇక ప్రాజెక్టు నిర్వాహణ అంశాలను తేల్చేందుకు 8వ తేదీ సమావేశం నిర్వహిస్తుంది. ఇప్పటికే సాగర్ నిర్వాహణను నవంబర్ 30వ తేదీకి ముందున్న పరిస్థితిలో తమకే అప్పగించాలని తెలంగాణ ఈఎన్‌సీ బోర్డును కోరిన నేపధ్యంలో కేంద్రం రెండు రాష్ట్రాల అధికారుల భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.