Telangana | కాంగ్రెస్‌.. కమ్యూనిస్టుల పొత్తులలో ప్రతిష్టంభన

Telangana | పోత్తుల పీటముడి.. అటు ఇటు హేమాహేమిలే.. విధాత: బీఆరెస్‌తో పొత్తుకు ఆశపడి గులాబీ బాస్ సీఎం కేసీఆర్ చేతిలో మోసపోయిన కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో పొత్తు కోసం భారీ ఆశలే పెట్టుకున్నారు. తెలంగాణలో అధికార సాధనకు ఒకరు..చట్టసభల్లో ఉనికి కోసం మరొకరికి పొత్తు బంధం అనివార్యమ నేపధ్యంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు పోత్తు కోసం చెరో అడుగు ముందుకేశారు. అయితే సీట్ల పంపకానికి వచ్చేసరికి పొత్తు చర్చలు రెండడుగులు ముందుకు ఒక అడుగు వెనక్కి అన్న […]

  • Publish Date - September 2, 2023 / 12:24 PM IST

Telangana |

  • పోత్తుల పీటముడి..
  • అటు ఇటు హేమాహేమిలే..

విధాత: బీఆరెస్‌తో పొత్తుకు ఆశపడి గులాబీ బాస్ సీఎం కేసీఆర్ చేతిలో మోసపోయిన కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో పొత్తు కోసం భారీ ఆశలే పెట్టుకున్నారు. తెలంగాణలో అధికార సాధనకు ఒకరు..చట్టసభల్లో ఉనికి కోసం మరొకరికి పొత్తు బంధం అనివార్యమ నేపధ్యంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు పోత్తు కోసం చెరో అడుగు ముందుకేశారు. అయితే సీట్ల పంపకానికి వచ్చేసరికి పొత్తు చర్చలు రెండడుగులు ముందుకు ఒక అడుగు వెనక్కి అన్న చందమన్నట్లుగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ప్రకటనకు అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు మొదలైనా, కామ్రేడ్లతో పొత్తు చర్చలు, సీట్ల లెక్కలు కొలిక్కి రాకపోవడం లెఫ్ట్ శ్రేణులను కలవర పెడుతుంది.

అటు వామపక్షాలతో పొత్తు కుదిరితే ఎవరి స్థానాలకు కోత పడుతుందోనన్న గుబులు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు టికెట్లు ఆశిస్తున్న సీట్లనే సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు కోరుతుండటంతో ఆ పార్టీల మధ్య పొత్తుకు ఆ సీట్లే పీటముడిగా తయారయ్యాయి. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సీపీఐ, సీపీఎంలు తలో ఐదు సీట్లు ప్రతిపాదనకు పెట్టాయి. కనీసం మూడు సీట్లు.. ఒకటో రెండో ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చినా సర్దుకుపోయేందుకు లెఫ్ట్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ఖమ్మం జిల్లా సీట్లే ప్రధాన ఆటంకంగా మారాయి.

పొత్తు లో భాగంగా సీపీఐ పార్టీ కొత్తగూడెం, వైరా, బెల్లంపల్లి, మునుగోడు, హుస్నాబాద్ సీట్లను కోరుతుంది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగమైన సీపీఐకి వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి సీట్లను కాంగ్రెస్ కేటాయించింది. చివరి నిమిషం పొత్తులు ఆ ఎన్నికల్లో సీపీఐకి నష్టదాయకమైంది. ఇప్పుడు సీపీఐ అడుగుతున్న మునుగోడు, కొత్తగూడెం సీట్లలో 2018ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీపీఎం పార్టీ ఇప్పుడు భద్రాచలం, పాలేరు, మధిర, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నంలను కోరింది. ఇందులో భద్రాచలం, మధిర, పాలేరులలో 2018ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య అంత సులభం ముందడుగు వేయడం లేదు.

వలసలతో మరింత జఠిలమైన పొత్తు ప్రక్రియ

సీపీఐ, సీపీఎంలు ఆశిస్తున్న సీట్లలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నుంచి ముఖ్య నేతలు టికెట్లు రేసులో ఉండడం సీట్ల సర్దుబాటును జఠిలం చేస్తుంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న ముఖ్య నాయకులు కూడా అవే సీట్లను అడుగుతుండటం సీట్ల సర్దుబాటుకు మరింత సవాల్‌గా మారింది. సీపీఐ కోరుతున్న కొత్తగూడెం సీటు విషయానికి వస్తే ఇక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలనుకుంటున్నారు. ఇదే సీటులో బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని భావిస్తున్న జలగం వెంగళరావు టికెట్ అడుగుతున్నారు. ఆయన కాంగ్రెస్ లోకి రాని పక్షంలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఏమ్మెల్యే పొట్ల నాగేశ్వరరావు, ఎడవెల్లి కృష్ణ వంటి బలమైన అభ్యర్థులు ఉన్నారు.

వైరా నుంచి బాలాజీ నాయక్, బానోతు విజయభాయి, రాందాస్ నాయకుల రూపంలో ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు ఉన్నారు. బెల్లంపల్లి స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ టికెట్ రేసులో ఉన్నారు. సీపీఐ రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరుకుంటున్న హుస్నాబాద్ లో ఈ దఫా కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. సీపీఐ రాష్ట్ర నేత పల్లా వెంకటరెడ్డి కోరుతున్న మునుగోడు స్థానంలో కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, పున్న కైలాశ్ నేతలు నేతలు టికెట్ ఆశిస్తున్నారు.

ఇక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరుతున్న పాలేరు సీటు టికెట్ బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్ లో చేరబోతున్న మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తుమ్మల నాగేశ్వరరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే రాయల నాగేశ్వరరావు, మువ్వ విజయ్ బాబులు టికెట్ రేసులో ఉన్నారు. ఇప్పటిదాకా పొంగులేటి ఈ టికెట్ రేసులో ఉన్నప్పటికి తుమ్మల కోసం పాలేరును, సీపీఐ కోసం కొత్తగూడెంను వదిలి ఖమ్మంకు మారారు. అదిగాక వైఎస్స్‌ర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని, తనకు పాలేరు టికెట్ కావాలని కోరుతుంది.

ఈ నేపథ్యంలో పాలేరు సీటును సీపీఎంకు కేటాయించడం కష్టంగానే ఉంది. సీపీఎం కోరిన భద్రాచలంలో సిటింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్య బరిలో ఉండబోతున్నారు. మధిరలో సీఎల్పీ నేత, సిటింగ్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మళ్లీ పోటీ చేయడం ఖాయం. సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి కోరుతున్న మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, కే. శంకర్ నాయక్ లు టికెట్ రేసులో ఉన్నారు. ఇబ్రహీంపట్నం సీటును కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కోరుకున్నారు.

ఇలా వామపక్షాలు కోరుతున్న 10 సీట్లలోనూ కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు, సిటింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు టికెట్ ఆశిస్తున్న నేపధ్యంలో ఆ సీట్లను కమ్యూనిస్టులకు కేటాయించడం కాంగ్రెస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఎంత త్యాగం చేసిన సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం, వైరాలు, సీపీఎంకు మిర్యాలగూడ, ఇబ్రహీం పట్నం స్థానాలు కొంత సర్ధుబాటులో భాగంగా ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌, ఉభయ కమ్యూనిస్టుల మధ్య పొత్తు చర్చలు కీలక దశకు వచ్చే నాటికి వీటిపై స్పష్టత రానుండగా, చివరగా కాంగ్రెస్‌లో ఎవరికి సీట్లకు కోత పడుతుందోనన్న ఆందోళన ఆ పార్టీ టికెట్ ఆశావహులను ఆందోళనకు గురి చేస్తుంది.

Latest News