Site icon vidhaatha

Delhi High Court | ఫైర్ NOC లేని కోచింగ్ సెంట‌ర్ల‌ను మూసివేయండి: హైకోర్టు

Delhi High Court

విధాత‌: దేశ రాజధానిలో అగ్నిమాపక శాఖ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లేకుండా నిర్వహిస్తున్న అన్ని కోచింగ్ సెంటర్ల‌ను మూసివేయాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. అన్ని నాన్-కన్ఫార్మింగ్ సంస్థల రిజిస్ట్రేషన్‌ను 40 రోజుల్లోగా రద్దు చేయాలని సూచించింది. ఢిల్లీలోని 583 కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో 67 మాత్రమే ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉన్నాయని ఢిల్లీ పోలీసుల ప్రకటనను కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ది.

ఉత్తర ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో జూన్ 15న జరిగిన అగ్నిప్రమాదంలో 61 మంది విద్యార్థులు గాయపప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో తమ ఆరోగ్యానికి, ప్రాణాలకు హాని కలిగిస్తున్న అక్రమ కోచింగ్ సెంటర్‌లను మూసివేయాలని కోరుతూ ముఖర్జీ నగర్ నివాసితులు, కంచన్ గుప్తా, లాడో సరాయ్, ఇతర ప్రాంతాల నివాసితులు దాఖ‌లు చేసిన పిల్‌పై ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం విచారించింది.

దేశ రాజధానిలో మిక్స్‌డ్ ల్యాండ్ యూజ్ కింద అనుమతించబడిన అన్ని కోచింగ్ సెంటర్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు ఫైర్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు లేవని, వాటిని మూసివేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. నగరం మాస్టర్ ప్లాన్-2021 (MPD-2021) క్రింద నిర్దేశించబడిన కోచింగ్ సెంటర్ల‌ను అనుమతిస్తామని, అయితే అలాంటి సంస్థలేవీ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా అమలు చేయడానికి అనుమతించబోమని హెచ్చ‌రించింది.

ఫైర్‌సేఫ్టీ లేకుండా కోచింగ్ సెంట‌ర్ల‌ను అనుమ‌తిస్తే నగరవ్యాప్తంగా అనధికార కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయని ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ నరులతో కూడిన ధర్మాసనం పేర్కొన్న‌ది. అందుకు ఈ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హించాల్సి వ‌స్తున్న‌ద‌ని తెలిపారు. ఈ అంశంపై త‌దుప‌రి విచారణ‌ను అక్టోబర్ 10వ తేదీకి ధ‌ర్మాస‌నం వాయిదావేసింది.

Exit mobile version