న్యూఢిల్లీ : ఇండిగో విమానాల సర్వీస్ ల రద్దు( IndiGo flight cancellation) పై ఢిల్లీ హైకోర్టు( Delhi High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారన్న ఢిల్లీ హైకోర్టు.. ఇండిగో ఘటన వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయిందని మండిపడింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. వందలాది విమానాలు ఒకేసారి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయని కేంద్రాన్ని మందలించింది. సంక్షోభ సమయంలో ఇతర సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు ఎలా పెంచుతాయని ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. విమాన ఛార్జీలు రూ.40,000 పెంచకుండా నిరోధించడంలో విఫలమైనట్లుగా తప్పుపట్టింది.
పైలట్లు ఎందుకు ఎక్కువ పనిభారంతో బాధపడుతున్నారో.. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇండిగో వ్యవహారంపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని కేంద్రం తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు వివరించారు. ఇండిగో సంస్థకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామన్న కేంద్రం తెలిపింది. విమానాల రద్దుపై ఇండిగో ఇప్పటికే క్షమాపణలు చెప్పిందని కేంద్రం గుర్తు చేసింది.
