- ఊపిరి పీల్చుకున్న జైలు సిబ్బంది
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా పరకాల సబ్ జైలు నుండి సోమవారం ఉదయం పరారైన ఖైదీ మహమ్మద్ గౌస్ పాషా కామారెడ్డి పల్లి సమీపంలోని వ్యవసాయ పొలాలలో దొరికినట్లు పరకాల సబ్ జైలు అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం సబ్ జైలు ఆవరణలోని చెత్తను బయట పోయడానికి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి మహ్మద్ గౌస్ బాషా పరారైన విషయం తెలిసిందే.
మహమ్మద్ గౌస్ పాషా జైలు నుంచి పరారైన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జైలు అధికారులు అతన్ని దొరక పట్టడం కోసం పరకాల పట్టణాన్ని జల్లెడ పట్టారు.
జైలు అధికారితో పాటు 8 మంది సిబ్బంది పరకాలతో పాటు ప్రధాన రహదారులను వ్యవసాయ పొలాలను లక్ష్యంగా చేసుకొని గాలింపు చేపట్టారు.
చివరకు పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామంలో లలిత కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు.
జైలు అధికారి ప్రభాకర్ రెడ్డితో పాటు 8 మంది సిబ్బంది సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడికి వెళ్లి అతడిని పట్టుకుని పరకాల సబ్ జైలుకు తీసుకొచ్చినట్లు జైలర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.