Weather Update | నూతన సంవత్సరం తొలి రోజునే ఉత్తరభారతంలో చలిపంజా విరిసింది. ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. దీనికి తోడు దట్టంగా పొగమంచు కురుస్తున్నది. చలి, పొగమంచుకు జనం అల్లాడుతున్నారు. ఇక రాబోయే రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఉత్తర భారతం అంతటా పొగ మంచు ఉంటుందని పేర్కొంది. పొగమంచు కారణంగా పలు రాష్ట్రాల్లో రైలు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అదే సమయంలో రోడ్డు రవాణా వ్యవస్థ సైతం ప్రభావితమవుతున్నది. ఒకటిన ఢిల్లీలో ఉదయం ఉష్ణోగత్రలు భారీగా పడిపోయాయి. పాలంలో 12.2 (-0.8), సఫ్దర్‌జంగ్‌లో 10.8 (-2.2) డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది
ఢిల్లీ నగరంతో పాటు ఎన్‌సీఆర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం ఎముకలు కొరికే చలి ఉన్నది. ఆకాశం మేఘావృతమై ఉండడంతో భానుడి వెలుగులు ప్రసరించలేదు. శ్రీనగర్, అనంత్‌నాగ్‌లలో మైనస్ 3.4 డిగ్రీలు, గుల్‌మార్గ్‌లో మైనస్ 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పొగమంచు కారణంగా రైళ్లు సైతం గమ్యస్థానాలకు చేరుకునేందుకు గంటల సమయం పట్టింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 2న ఉదయం, ఆ తర్వాత మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
సీజన్‌లో అత్యంత శీతలమైన రోజు డిసెంబర్ 31
పాదరసం పడిపోవడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత అత్యల్పం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో అత్యంత శీతలదినంగా డిసెంబర్ 31 నిలిచింది. సోమవారం నుంచి గాలి దిశలు మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయువ్య దిశల నుంచి వీచే మంచు గాలుల కారణంగా ఉష్ణోగ్రత మరింత తగ్గనున్నది. ఈ క్రమంలో వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆదివారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 15.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ కావడం గమనార్హం.
ఆరెంజ్ అలెర్ట్ జారీ
వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పగటిపూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం ఒక మోస్తరు నుంచి దట్టమైన పొగమంచు తెలిపింది. ఆదివారం ఢిల్లీలో రిడ్జ్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో పాటు లోధీరోడ్డులో 10.8 డిగ్రీలు, ఆయనగర్‌లో 11.4, పాలెంలో 11.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత రిడ్జ్‌లో 14.6 డిగ్రీల సెల్సియస్, లోధి రోడ్‌లో 15.0, పాలెంలో 16.1, ఆయనగర్‌లో 16.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.