Cricket | BCCI ‘పన్ను’ సిత్రాలు.. కోట్ల ఆదాయం.. ప‌న్ను సున్నా!

Cricket ప్రపంచంలో అతి సంపన్న క్రికెట్‌ పాలకమండలి చట్టం ముసుగులో పన్ను మినహాయింపు రాచ‌రికం అనుభ‌విస్తున్న మండ‌లి స‌భ్యులు నెపొటిజానికి కేరాఫ్ అడ్ర‌స్ మారిన బీసీసీఐ అందుకే ప‌న్ను పోటుల నుంచి రక్షిస్తోందా? ముంబై: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ పాల‌క మండ‌లి బీసీసీఐ. ల‌క్ష‌ల కోట్ల ఆదాయం.. అయినా, ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్ను గుండు సున్నా. చట్టం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న‌ది బీసీసీఐ. కేంద్రంలో అధికారంలో ఉండే వార‌సుల అడ్డాగా మారిందని, మండ‌లి స‌భ్యులు […]

  • Publish Date - June 23, 2023 / 11:45 AM IST

Cricket

  • ప్రపంచంలో అతి సంపన్న క్రికెట్‌ పాలకమండలి
  • చట్టం ముసుగులో పన్ను మినహాయింపు
  • రాచ‌రికం అనుభ‌విస్తున్న మండ‌లి స‌భ్యులు
  • నెపొటిజానికి కేరాఫ్ అడ్ర‌స్ మారిన బీసీసీఐ
  • అందుకే ప‌న్ను పోటుల నుంచి రక్షిస్తోందా?

ముంబై: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ పాల‌క మండ‌లి బీసీసీఐ. ల‌క్ష‌ల కోట్ల ఆదాయం.. అయినా, ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్ను గుండు సున్నా. చట్టం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న‌ది బీసీసీఐ. కేంద్రంలో అధికారంలో ఉండే వార‌సుల అడ్డాగా మారిందని, మండ‌లి స‌భ్యులు రాచ‌రికం అనుభ‌విస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. వ‌చ్చే ఆదాయం.. అయ్యే ఖ‌ర్చుకు జ‌వాబుదారీత‌నం లేక‌పోవ‌డమే ఇందుకు కార‌ణంగా తెలుస్తున్న‌ది.

కేంద్రంలో అధికారంలో ఉండేవారి పిల్ల‌ల‌కు రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతున్నందునే చ‌ట్టాల‌ మార్పుపై కేంద్ర‌ స‌ర్కారు అంతగా దృష్టి పెట్ట‌డం లేద‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. అదే ఇంత పెద్ద మొత్తంలో సంపాదించే ఇత‌ర సంస్థ‌ల‌పై ఇదే స్థాయిలో కేంద్రం ఉదాసీనంగా ఉండేదా? అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

భారత్‌లో క్రికెట్ క్రేజ్!

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ ఏంటో మనకు తెలియంది కాదు. చిన్న నుంచి పెద్ద వరకు, సామాన్యుల నుంచి మేధావుల వరకు.. అసలు క్రికెట్ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తికాదు. అంతగా మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది క్రికెట్. ఆటంటే క్రికెట్ ఒక్క అన్నంతగా మారిపోయింది. క్రికెట్ పుణ్యమా అని.. సంప్రదాయ ఆటలు అటకెక్కాయి.

కొద్దోగొప్పో ప్రోత్సహించినా వాటిని పట్టించుకునే దిక్కే ఉండదు. అంతటి క్రేజ్ ఉన్న క్రికెట్ అంతే స్థాయిలో వాడుకుంటూ వేల కోట్లు సంపాదిస్తున్న‌ది భాత‌ర‌ క్రికెట్ నియంత్ర‌ణా మండ‌లి (BCCI). అంతవరకు బాగానే ఉన్న‌ది. కానీ, తిన్నా తినకున్నా.. తాగే కాసిన్ని గంజినీళ్లపైనా ముక్కుపిండి పన్నులు వసూలు చేసే కేంద్ర‌ ప్రభుత్వం.. BCCI మీద మాత్రం వల్లమాలిన ప్రేమ చూపిస్తున్న‌ది.

ఎందుకని ప్రశ్నిస్తే.. అదో స్వచ్ఛంద సంస్థ అని సెల‌విస్తున్న‌ది. క్రికెట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో నెలకొల్పిన గొప్ప ధార్మిక సంస్థగా కీర్తిస్తున్న‌ది. IPL పేరుతో బీసీసీఐ వేలకోట్లు పోగేసుకుంటూ.. రాచరికం అనుభవిస్తున్న సంగతి తెలియంది కాదు. అలాంటి సంస్థపై పన్ను మాట ఎత్తారా? ఇక అంతే సంగతులు. సేవాదృక్పథంతో ఏర్పాటు చేసిన సంస్థపై పన్నులా? ఎంతటి ఘోరం? ఎంత పాపం? ఇంతకు మించిన అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? అన్నంతగా మీదపడిపోతున్న‌ది

బీసీసీఐ ప‌న్ను క‌ట్ట‌క‌పోవడానికి కార‌ణ‌మేంటి?

బీసీసీఐ అనేక ఒక స్వ‌చ్ఛంద సంస్థ‌. ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశంలో క్రికెట్‌ను ప్రోత్స‌హించేందుకు ఏర్పాటైన సంస్థ‌. ఐపీఎల్ పేరుతో ప్ర‌పంచంలోనే ఏ క్రీడా సంస్థ‌కూ లేని ఆదాయం వస్తున్నా.. పన్ను అడిగే దిక్కుండదు. అందుకు చట్టాల్లో లోపమే కారణమని చెప్పక తప్పదు.

ఆదాయపన్ను చట్టం-1961 సెక్షన్ 12ఏ అదే చెబుతున్న‌ది. వేల కోట్లు సంపాదిస్తున్న సంస్థ చట్టం ముసుగులో పన్ను మినహాయింపు పొందడంపై కడుపు మండిన కొందరు కోర్టులను సైతం ఆశ్రయించారు. అయినా ఫలితం సున్నా. కోర్టులు సైతం దానికే అనుకూలంగా తీర్పునిచ్చాయి.

BCCIకి ఐటీ షోకాజ్ నోటీసులు!

కాలాగుణంగా వస్తున్న మార్పులు, మారుతున్న ప్రభుత్వాలు BCCI ట్యాక్స్ మినహాయింపుపై దృష్టిపెట్టాయి. 2016లో ఇన్ క‌మ్ ట్యాక్స్‌ అధికారులు పన్ను కట్టాలంటూ BCCIకి మూడు షోకాజ్‌ నోటీసులిచ్చారు. అంతే.. మాకే నోటీసులా అంటూ అంతెత్తున లేచింది బీసీసీఐ. ఇంకేముంది? 2017లో ఈ పంచాయితీ ఆదాయపన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు చేరింది. బీసీసీఐని పన్ను మినహాయింపు నుంచి తొలగించాలని ఐటీ వాదించింది. అదే చట్టంలోని పన్ను మినహాయింపును గుర్తుచేస్తూ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించింది బీసీసీఐ.

ఐటీ, బీసీసీఐ వాదనలు విన్న ధర్మాసనం.. బీసీసీఐకే అనుకూల తీర్పునిచ్చింది. పైగా.. కీలక వ్యాఖ్యలు చేసింది. బీసీసీఐ డబ్బు సంపాదిస్తున్నప్పటికీ.. క్రికెట్‌ను ప్రోత్సహించే సదుద్దేశంతో పనిచేస్తున్న‌దని చెప్పింది. ఉన్నత లక్ష్యం కోసం పనిచేసే సంస్థపై పన్ను వేయడం సరికాదని వ్యాఖ్యానించింది.

బీసీసీఐకి కాసులు కురిపిస్తున్న IPL!

2023-2027 మధ్య కాలానికి నిర్వహిస్తున్న‌ ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో టీవీ, డిజిటల్ రైట్స్ కలిపి 48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. కేవలం డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయకామ్ 20 వేల కోట్లకుపైగా వెచ్చించి దక్కించుకుంది.

ఈ లెక్కలు చాలు బీసీసీఐకి వచ్చే ఆదాయం ఏ స్థాయిలో ఉందో తెలియడానికి.. ఇందులో ఫ్రాంచైజీలకూ -వాటా ఉంటుంది. మిగతావి నిర్వహణ, వేతనాల వంటివి ఉంటాయి. ఎంత కాదనుకున్నా బీసీసీఐకి మిగిలేది వేల కోట్లలోనే ఉంటుందనేది సుస్పష్టం.

దశాబ్దాలుగా మారని చట్టం !

మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో సవరణలు చేయడం పరిపాటి. కానీ బీసీసీఐ విషయంలో ఇవేమీ పనిచేయలేదు. అంటే.. ఆ సంస్థ ప్రభుత్వాలను ఏస్థాయిలో మేనేజ్ చేస్తున్న‌దో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి పన్నుల వసూలు చేసేందుకు ఉవ్విళ్లు ఊగే ప్రభుత్వాలు..

బీసీసీఐ విషయంలో మాత్రం కిమ్మనకుండా ఉండటంపై మేధావులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల అనుచరులు, వారసులు బీసీసీఐలో కీలకస్థానాల్లో ఉండే అందుకు కారణమంటున్నారు. చట్టంలో మార్పులు తెచ్చి బీసీసీఐని ట్యాక్స్ పరిధిలో డిమాండ్ చేస్తున్నారు.

త్వరలో వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌

వచ్చే ఐదునెలల్లో వన్డే మెన్స్ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ నిర్వహణకు సిద్ధమైంది బీసీసీఐ. ఈ ప్రపంచ క‌ప్‌కు మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకపోవడం ఐటీకి కాస్త ఊరటనిచ్చే అంశం. వర‌ల్డ్ క‌ప్ కోసం బీసీసీఐ 963 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉన్న‌ది. ఆ పన్నును సైతం ఎగ్గొట్టేందుకు ఎత్తులు వేస్తున్న‌ది బీసీసీఐ. సాధారణంగా వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభానికి ఏడాదికి ముందే షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉన్న‌ది. అయినా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

965 కోట్లు ఎగ్గొట్టేందుకు ఐటీ చట్టాన్ని మరోసారి వాడుకునే ప్రయత్నంలో ఉన్న‌ందునే ఆలస్యం జరుగుతున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టోర్నీ నిర్వహణకు ప్రభుత్వ అనుమతుల పేరుతో జాప్యం చేస్తున్న‌ది. అందుకే అధికారిక ప్రకటనపై ఆలస్యం అవుతోందని చెబుతున్నారు క్రికెట్ నిపుణులు. చూడాలి మరి.. ఈ మాత్రం పన్నైనా క‌డుతుందో లేక ఎగ్గొడుతుందో..

Latest News