Heat Waves | ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండ‌లు.. హీట్‌వేవ్‌లో చిక్కుకున్న ప‌లు దేశాలు

Heat Waves విధాత‌: గ్లోబల్ వార్మింగ్ (Global Warming) కార‌ణంగా పెరిగిన ఉష్ణోగ్ర‌త‌ల ప్ర‌భావాన్ని ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌త్య‌క్షంగా అనుభ‌విస్తున్నాయి. శ‌నివారం అమెరికా (America) , జ‌పాన్, యూర‌ప్‌లో న‌మోదైన అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌కు ఆయా దేశాల ప్ర‌జలు న‌ర‌కం చూశారు. యూఎస్‌లోని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వ‌ర‌కు వేడి గాలులు (Heat Waves), అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వ‌డంతో.. ఆ దేశ వాతావ‌ర‌ణ సంస్థ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వారాంతంగా శ‌ని, ఆదివారాల‌ను ప్ర‌క‌టించింది. ఆరిజోనా రాష్ట్రంలో సూర్యుని ప్ర‌తాపం బాగా […]

  • Publish Date - July 16, 2023 / 05:21 AM IST

Heat Waves

విధాత‌: గ్లోబల్ వార్మింగ్ (Global Warming) కార‌ణంగా పెరిగిన ఉష్ణోగ్ర‌త‌ల ప్ర‌భావాన్ని ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌త్య‌క్షంగా అనుభ‌విస్తున్నాయి. శ‌నివారం అమెరికా (America) , జ‌పాన్, యూర‌ప్‌లో న‌మోదైన అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌కు ఆయా దేశాల ప్ర‌జలు న‌ర‌కం చూశారు. యూఎస్‌లోని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వ‌ర‌కు వేడి గాలులు (Heat Waves), అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వ‌డంతో.. ఆ దేశ వాతావ‌ర‌ణ సంస్థ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వారాంతంగా శ‌ని, ఆదివారాల‌ను ప్ర‌క‌టించింది.

ఆరిజోనా రాష్ట్రంలో సూర్యుని ప్ర‌తాపం బాగా క‌నిపిస్తోంది. ఇక్క‌డ వ‌ర‌స‌గా 16 రోజుల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ల‌పైనే న‌మోద‌వుతున్నాయి. భూమి మీద అత్యంత గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త (Maximum Temperatures) లు న‌మోద‌య్యే ప్ర‌దేశంగా పేరున్న కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 54 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్ర‌త‌లు 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి కింద‌కి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో ప‌గ‌టి పూట ప్ర‌జ‌లెవ‌రూ అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు రావొద్ద‌ని. డీ హైడ్రేష‌న్‌కు గుర‌య్యే ప్ర‌మాద‌ముంద‌ని వాతావ‌ర‌ణ సంస్థ‌లు, స్థానిక ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. ఈ ఎండ‌ల దెబ్బ‌కు అడ‌వుల్లోని చెట్లు ఎండిపోవ‌డంతో నిప్పు రాజుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణ కాలిఫోర్నియాలో సుమారు 3000 ఎక‌రాల అడ‌వి త‌గ‌ల‌బ‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

యూర‌ప్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైన ఇట‌లీ.. అధిక‌ ఉష్ణోగ్ర‌త‌ల‌తో విల‌విల్లాడుతోంది. రోమ్‌, బోలోగ్నా త‌దిత‌ర 16 ప‌ట్ట‌ణాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌రిత్ర‌లో న‌మోదుకాని హీట్ వేవ్‌కు దేశ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండాల‌ని అందులో పేర్కొన్నారు. 2007లో రోమ్‌లో న‌మోదైన 40.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటి 43 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావొచ్చ‌ని అంచ‌నాలున్నాయి. గ్రీస్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైన ఏథెన్స్ అక్రోపోలిస్ను వ‌ర‌స‌గా మూడో రోజు అత్యధిక ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా మూసేశారు.

అస‌లే నీటి ఎద్ద‌డితో ఇబ్బంది ప‌డుతున్న ఎడారి దేశం జోర్డాన్‌ను కార్చిచ్చులు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌కు ఇక్క‌డి అడ‌వులు కాలిపోతుండ‌టంతో గ‌త రెండు రోజుల్లో సుమారు 214 ట‌న్నుల నీటిని అక్క‌డ కుమ్మ‌రించాల్సి వ‌చ్చింది. ఉష్ణోగ్ర‌త అధికంగా న‌మోద‌య్యే ఇరాక్‌లో ప‌రిస్థితి ఘోరంగా ఉంది. వేడి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఇక్క‌డి టైగ్ర‌స్ న‌దిలో కొన్నేళ్ల క్రితం వ‌ర‌కు ఈత కొట్టే వాళ్ల‌మ‌ని.. ఇప్పుడు న‌ది మ‌ధ్య‌లోకి వ‌చ్చినా న‌డుం వ‌ర‌కు కూడా నీరు లేద‌ని విస్సాం అబీద్ అనే వ్య‌క్తి వాపోయారు. ప్ర‌స్తుతం 50 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతుండటంతో న‌ది వేగంగా ఎండిపోతోంది.

ఏడాది ఏడాదికి ప‌రిస్థితి ఘోరంగా మారుతోంద‌ని అబీద్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తూర్పు దేశ‌మైన జ‌పాన్‌లోనూ ఉష్ణోగ్ర‌త‌లు ఠారెత్తిస్తున్నాయి. 40 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావొచ్చ‌ని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వాతావ‌ర‌ణ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. మ‌రోవైపు కొద్ది రోజులు హీట్ వేవ్‌తో ఇబ్బంది ప‌డిన భార‌త్‌లో తాజాగా కురుస్తున్న వ‌ర్షాల‌కు సుమారు 90 మంది ప్రాణాలు కోల్పోయారు. వ‌ర‌దలు, వ‌ర్షాలు ఈ కాలంలో సాధార‌ణ‌మే అయిన‌ప్ప‌ట‌కీ.. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల తీవ్ర‌త పెరిగి ప్రాణ న‌ష్టం ఎక్కువ‌గా న‌మోదైంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Latest News