విధాత: సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్చడం మంచిది కాదని సీనియర్ నేతలకు దిగ్విజయ్ సింగ్ సూచించినట్లు తెలిసింది. ముందు కలిసి పనిచేసి ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడాలని నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
భారత దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజాస్వామ్య రక్షణ కోసం రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న జోడో యాత్ర మంచి ఉత్సాహాన్ని కలిగించిందని, అదే ఉత్సాహంలో నేతలంతా కలిసి పని చేయాలని సీనియర్ నేతలకు దిగ్విజయ్ సూచించారు.
వరంగల్ డిక్లరేషన్‌తో పాటు, రాహుల్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లడానికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్రలు చేయాలని ఏఐసీసీ పిలుపు ఇచ్చిందని, దీనిని తెలంగాణలో విజయవంతం చేయాలని నేతలకు డిగ్గిరాజా స్పష్టం చేశారట.
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాల్సిందేనని వారికి తెలిపినట్లు సమాచారం. అయితే పాదయాత్ర పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్‌పీ నేత కూడా పాల్గొనేలా అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది.
ఆవేదన వ్యక్తం చేసిన నేతలు..
సేవ్ కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టిన సీనియర్ నేతలంతా పీసీసీ అధ్యక్షుడిని, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీని మార్చాలని దిగ్విజయ్ సింగ్ వద్ద పట్టుబట్టినట్లు తెలిసింది. రాష్ట్రంలో పీసీసీ, సీఎల్‌పీ, ఇతర సీనియర్ నేతల మధ్య సఖ్యత లేదని, వీరిని సమన్వయం చేయడంలో ఇన్‌చార్జీ పూర్తిగా విఫలమయ్యారన్న అభిప్రాయానికి డిగ్గీ రాజా వచ్చినట్లు సమాచారం.
ముఖ్యంగా నేతలంతా సమన్వయ లోపాన్నే డిగ్గి రాజా వద్ద ప్రధాన అంశంగా చర్చించినట్లు తెలిసింది. ఏకపక్షంగా పీసీసీ అధ్యక్షులు వ్యవహరిస్తున్నారని, ఏ నిర్ణయాలు తీసుకున్నా తమకు తెలియజేయడం లేదని సీనియర్లు మొరపెట్టకున్నట్లు తెలిసింది.
ఇదే సమయంలో కోవర్టులనే ముద్ర తమపై వేసి ప్రచారం చేస్తున్నారని పలువురు సీనియర్ నేతలు తమ ఆవేదన వ్యక్తం చేశారట. అలాగే రేవంత్ వర్గం నేతలు ముఖ్యంగా సీతక్క తమను వలస వాదులని పిలవడం బాధకు గురి చేసిందని వాపోతున్నారు.
సమన్వయలోపమే…
అయితే ఏ రాష్ట్రంలోనైనా పీసీసీ, సీఎల్‌పీ, సీనియర్ల మధ్య అంతరాలు వచ్చే అవకాశం ఉంటుందని, వీటన్నింటిని సమన్వయం చేయడానికే జాతీయ పార్టీ నాయకత్వం ఆయా రాష్ట్రాల వ్యవహరాలను చూడటానికి ఇంచార్జీలను నియమిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ పూర్తిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్షమే వహిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
రేవంత్ రెడ్డి పీసీసీ పదవులన్నీ టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే ఇచ్చిట్లు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. సీనియర్ నేతలకు రేవంత్ వర్గానికి మధ్య పంచాయతీకి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో రేవంత్ వర్గం పీసీసీ పదవులకు రాజీనామాలు చేసిన విషయం అందరికి తెలుసు. ఇదే విషయాన్ని సీనియర్లు దిగ్విజయ్ వద్దకు తీసుకు వెళ్లారు. ఈ విషయాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతానన్న ఆయన, సీనియర్లు, జూనియర్లను సమన్వయం చేయడంలో ఇన్‌చార్జీ వైఫల్యంగా భావించినట్లు తెలుస్తోంది.
ఏకతాటిపై నడిపించాలంటే…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలందరినీ ఏక తాటిపై ఉంచి ఉద్యమాలు చేపట్టాలంటే సీఎంగా, అంతకంటే ఎక్కుగా పని చేసిన సీనియర్ నేతలైతేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ సీనియర్లు కూడా ఇదే విషయాన్ని దిగ్విజయ్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ మేరకు ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి సీనియర్ నేతను ఇన్‌చార్జీగా నియమిస్తే మంచిందనే అభిప్రాయాన్ని దిగ్విజయ్ వెల్లడించే అవకాశం ఉన్నట్లు రాష్ర్ట కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.