(విధాత ప్రత్యేకం)
ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి కర్ణుని చావునకు ఉన్నట్టు వంద కారణాలేమీకాదు.. లోతుగా పరిశీలిస్తే కొన్ని అంశాల ఫలితంగానే ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమకాల కోసమే జరిగినా ఇక్కడ ఆత్మగౌరవం అన్నది కూడా కీలకం. ఈ ప్రాంత ప్రజలు అహంకారభావాన్ని సహించరు. తమ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే ఊరుకోరు అన్నది అందరికీ తెలిసిన విషయమే.
2014లో ఆ పార్టీ 63 సీట్లు గెలిచినప్పుడు అప్పటికి పార్టీకి నిర్మాణమూ లేదు. అన్ని జిల్లాల్లో పటిష్ఠంగా లేదు. కానీ కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో అభ్యర్థులు ఎవరు అన్నది పట్టించుకోకుండా ఓట్లు వేశారు. అందుకే మొదటిసారి బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన కొంతమంది అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అంతలా తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఆదరించారు.
ఫిరాయింపులపై ప్రజాగ్రహం
మొదటిసారి పాలనలో తొలి మూడేళ్లు ప్రభుత్వ పనితీరు బాగున్నదనే అభిప్రాయం అందరిలో ఉన్నది. సంక్షేమ పథకాలు, కరెంటు, సాగు, తాగు నీటి కష్టాలు తీర్చిందున గడువుకంటే ముందే (పెద్దగా కారణం లేకున్నా) అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినా ప్రజలు అవేవీ పట్టించుకోకుండా ఏకంగా 88 స్థానాలు కట్టబెట్టారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఆ పార్టీలో చేరారు. దీంతో అసెంబ్లీలో బీఆర్‌ఎస్ బలం 90కి చేరింది. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజా సమస్యలు చట్టసభల్లో ప్రస్తావనకు వస్తాయి. ప్రభుత్వాలు పనిచేయడం, తమ పాలన విధానాల్లోని లోపాలను సవరించుకోవడానికి వీలు కలుగుతుంది.
ఇలాంటివి కేసీఆర్‌కు నచ్చనట్టున్నాయి. 19 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది పార్టీ ఫిరాయించడానికి పరోక్షంగా తోడ్పాటునందించారు. ఒకవేళ వాళ్లంతా పార్టీ మారాలని భావించి ఉంటే వారితో రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకుంటే బాగుండేది. అప్పుడే ప్రజా తీర్పు ఏమిటి అన్నది బీఆర్‌ఎస్ అధినేతకు అవగతమయ్యేది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మందిలో 9 మందిని ప్రస్తుతం ప్రజలు ఓడించారు. ఫిరాయింపులపై ప్రజాగ్రహం ఏ విధంగా ఉన్నదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
నియామకాలపై నిర్లక్ష్యం
తెలంగాణ తెచ్చుకున్నదే మా కొలువు మాగ్గావాలని. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామకాలు చేపట్టలేదని కాదు. కానీ నియామకాల విషయంలో ఒక నిర్దిష్ట కార్యాచరణ లేకపోవడం, నోటిఫికేషన్లు అచ్చి, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తమ చేతికి అపాయింట్‌మెంట్లు అందేదాకా కోర్టు కేసులు, ఇతర అనేక కారణాలతో తీవ్రమైన కాలయాపన జరిగింది.
ఇక కొలువుల గురించి ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేయించడం పరిపాటిగా మారింది. దీనికితోడు గత ఏడాది 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోయింది. ఇక ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగులను ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాలు, పరీక్షల రద్దు వంటివి వారిని నిరాశ నిస్పృహల్లోకి నెట్టాయి. ఆ సమయంలో వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యతాయుత ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోలేదు.
అసలు నిరుద్యోగులు మాకు ఓటు వేసినా వేయకపోయినా ఫర్వాలేదు అన్నట్టు వ్యవహరించింది. ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగులే కాదు వారి తల్లిదండ్రులు సంక్షేమ పథకాలు పొందుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు కనిపిస్తున్నది. ఉద్యమ కాలం నాటి నినాదాల్లో ప్రధానమైన నియామకాలపై అధికార ప్రభుత్వ అలసత్వానికి తోడు ఒక నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే దాన్నికూడా మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడటంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరణి తెచ్చిన తంటాలు
రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్న ధరణిలో అనేక లోపాలున్నాయని రైతులు, రైతు సంఘాలు, ఆ రంగంలోని నిపుణులు అనేకసార్లు ప్రభుత్వానికి చెప్పినా వారి విజ్ఞప్తులను పెడచెవిన పెట్టింది. ధరణిలోని లోపాలు సవరించుకునే ప్రయత్నం చేయకపోగా.. కాంగ్రెస్ వస్తే తిరిగి దళారీ వ్యవస్థ వస్తుందని ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే ధరణి కంటే ముందున్న భూ సమస్యల కంటే ఆ ప్రాజెక్టు అమల్లోకి వచ్చాక వారి సమస్యలు ఎక్కువ అయ్యాయి అన్నది వారి అనుభవంలో ఉన్నది. అందుకే రైతుబంధు ఇచ్చినా, రైతు బీమా ఇచ్చినా, సాగునీరు, కరెంటు ఇచ్చినా కేసీఆర్ తెచ్చిన ధరణితో ఇబ్బంది పడ్డ గ్రామీణ రైతాంగం ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓటు వేసింది.
అభ్యర్థులనూ మార్చినా మార్పునకే ప్రజల మొగ్గు
అభ్యర్థులను మారిస్తే అధికారపార్టీకి లబ్ధి జరిగేదనేవాదన కూడా అసంబద్ధమైనది. ఎందుకంటే కేసీఆర్ క్యాబినెట్‌లోని ఆరుగురు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్‌ల ఓటమి ప్రభుత్వ పనితీరు బాగాలేదు అనడానికి నిదర్శనం. అభ్యర్థులను మార్చడం కాదు ఆట తీరు మార్చాలని తెలంగాణలో ఉద్యమంలో కీలకం పనిచేసిన వాళ్లు చాలా ఏళ్లుగా ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. కానీ మాకు తెలిసినంత మరెవరికీ తెలియదన్నట్టు ప్రభుత్వాధినేత వ్యహరించారు. ఫలితంగా బీఆర్‌ఎస్ ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువ షాక్ ఇచ్చారని అనుకోవచ్చు.
ఉద్యోగుల తిరుగుబాటు
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వారి జీతాలు గణనీయంగా పెరిగినా 317 జీవో వంటి పట్ల వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడినారు. ఉద్యమంలో ఐక్యంగా ఉన్న ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చింది. ఉద్యోగుల్లో కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి అనకూలంగా మారడం, వాళ్లను చూసుకునే వేలామంది ఉద్యోగులను వాదనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్లు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలే కాదు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులైతే ఏకంగా మార్పు ప్రచారం బాగానే చేశారు. ఉద్యోగుల పట్ల కొంత సానుకూల వైఖరితో ఉంటే ఇంకో ఐదు పది స్థానాలు బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చేవి అనే వాదన ఉన్నది.
మేడిగడ్డతోనే కుంగిన బీఆరెస్
కాళేశ్వరం ప్రాజెక్టును తమ ఘనతగా బీఆరెస్ ప్రభుత్వం చెప్పుకొన్నది. మరో అడుగు ముందుకేసి.. అసలు దాన్ని తన మెదడు కరగదీసి.. తానే డిజైన్ చేశానని కేసీఆర్ చెప్పుకొన్నారు. నిజానికి కాళేశ్వరం కట్టిన దగ్గర నుంచి ఎత్తిపోసింది పిసరంతే. అదెలా ఉన్నా.. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, రెండ్రోజులకే అన్నారం బరాజ్‌లోనూ బుంగలు రావడంతో అక్కడే బీఆరెస్ కుంగింది.
నయా గడీ ప్రగతిభవన్
ఈ ఫలితాలను రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజల నిరసనగా భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వంటి నేతల అహంకారపూరిత వ్యాఖ్యలు బాగా చర్చనీయాంశం అయ్యాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో కేటీఆర్ లేదా హరీశ్ స్పందించిన తీరుకూడా జనం మెచ్చలేదు. ప్రత్యేకించి ప్రగతిభవన్‌లోకి సాధారణ జనం సంగతి సరేసరి.. ఆఖరుకు మంత్రులకు కూడా అవకాశం లేకపోవడం జనంలోకి బాగా వెళ్లింది.
ఆత్మను తీసేశారు
తెలంగాణ రాష్ట్ర సమితి పేరులోనుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేయడంతోనే గులాబీ పార్టీ పార్టీలో తెలంగాణ ఆత్మ చచ్చిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానికి తోడు బీఆరెస్-బీజేపీ మిత్రులన్న విషయం ప్రజలకు కూడా అర్థమైంది.
అతి భజన
ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమం చేసినా, ఒక పథకం ప్రారంభించినా దాన్ని గొప్పగా ప్రచారం చేయడం, కేసీఆర్ ప్రభుత్వానికి భజన చేయడం వంటివి కూడా బెడిసి కొట్టాయి. లోపాలున్నాయని తెలిసినా అంతా బాగున్నదని, అసలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన దేశానికే దిక్సూచి అన్నట్టు ప్రసార, ప్రచార, సోషల్ మీడియాల్లో కేసీఆర్ ఎప్పుడూ చెప్పే ‘స్వ డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా’ ప్రజలకు నచ్చలేదు. అందుకే ఇది కాంగ్రెస్ గెలుపు అనే కంటే కేసీఆర్ స్వయంకృత ఫలితం అంటే బాగుంటుంది.