Tamilnadu | మంత్రి బర్తరఫ్‌ ఉత్తర్వులు సస్పెన్షన్‌లో.. తమిళనాడు గవర్నర్‌ వెనుకడుగు!

Tamilnadu | TN Governor సెంథిల్‌పై ఉత్తర్వులు నిలిపేసిన రాజ్‌భవన్‌ ఢిల్లీ పెద్దల ఆదేశాలోనే తగ్గిన రవి! మరోసారి చర్చలోకి గవర్నర్‌ పరిధి చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయంలో ఆ రాష్ట్ర గవర్నర్ రవి వెనుకడుగు వేశారు. ఆ నిర్ణయంపై తీవ్ర విమర్శలు తలెత్తడంతో దానిని ఉపసంహరించుకున్నారు. సెంథిల్‌ బాలాజీని బర్తరఫ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో […]

  • Publish Date - June 30, 2023 / 08:56 AM IST

Tamilnadu | TN Governor

  • సెంథిల్‌పై ఉత్తర్వులు నిలిపేసిన రాజ్‌భవన్‌
  • ఢిల్లీ పెద్దల ఆదేశాలోనే తగ్గిన రవి!
  • మరోసారి చర్చలోకి గవర్నర్‌ పరిధి

చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయంలో ఆ రాష్ట్ర గవర్నర్ రవి వెనుకడుగు వేశారు. ఆ నిర్ణయంపై తీవ్ర విమర్శలు తలెత్తడంతో దానిని ఉపసంహరించుకున్నారు. సెంథిల్‌ బాలాజీని బర్తరఫ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆయన మంత్రిగా కొనసాగనున్నారు.

ఈ విషయంలో కోర్టుకు వెళతామని అంతకు ముందు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఫోన్‌లు వచ్చాయని తెలిసింది. ప్రభుత్వం కోర్టుకు వెళితే.. తలెత్తే రాజకీయ ఇబ్బందులు, దేశవ్యాప్తంగా దాని పరిణామాలపై గవర్నర్‌కు చెప్పడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. మంత్రి బర్తరఫ్‌ విషయంలో అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని తీసుకోవాల్సిందిగా రాజ్‌భవన్‌కు సూచనలు వచ్చినట్టు చెబుతున్నారు.

రాజ్యాంగంలోని 164 (1)వ అధికరణం.. ముఖ్యమంత్రిని గవర్నర్‌ నియమించాలని, ఆయన సూచనల మేరకు మంత్రులను నియమించాలని పేర్కొంటున్నది. ‘గవర్నర్‌కు ఒక మంత్రిని తొలగించే అధికారం లేదు. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు న్యాయ సలహా తీసుకుంటానని రవి చెబుతున్నారు. సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగించే ముందే ఆయన ఈ పని చేయాల్సింది’ అపి డీఎంకే అధికార ప్రతినిధి, న్యాయవాది శరవణన్‌ అన్నాదురై చెప్పారు.

గవర్నర్‌ ఉత్వర్వులు జారీ చేసిన అనంతరం గురువారం పొద్దుపోయిన తర్వాత డీఎంకే రాజ్యసభ సభ్యుడు పీ విల్సన్‌, ఇతర న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంప్రదింపులు జరిపారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గవర్నర్‌ ఆదేశాలను కోర్టులో సవాలు చేసే అంశంపై చర్చలు జరిగాయని ఆ వర్గాలు వెల్లడించాయి.

రవి చర్యలు, కోర్టులను ఆశ్రయించాలన్న డీఎంకే ప్రభుత్వం ఆలోచన.. మరోసారి గవర్నర్‌కు ఉన్న రాజ్యాంగపరమైన అధికారాలపైన, రాజకీయ అంశాల్లో తలదూర్చేందుకు ఉన్న అవకాశాలపై చర్చకు దారి తీశాయి. గవర్నర్‌కు ఉన్న అధికారాలపై సుప్రీం కోర్టు ఇప్పటికే అనేక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం సలహాలు, సూచనలపైనే ఆయన అధికారాలు ఉంటాయని పలు తీర్పుల్లో సుప్రీం కోర్టు పేర్కొన్నది.