హిమాచ‌ల్‌లో భారీ ట్రాఫిక్ జామ్‌.. న‌ది గుండా కారు ప్ర‌యాణం..

క్రిస్మ‌స్‌, బాక్సింగ్ డే సెల‌వుల నేప‌థ్యంలో గ‌త వారం రోజులుగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు ప‌ర్యాట‌కులు పోటెత్తిన సంగ‌తి తెలిసిందే

  • Publish Date - December 26, 2023 / 06:40 AM IST

సిమ్లా : క్రిస్మ‌స్‌, బాక్సింగ్ డే సెల‌వుల నేప‌థ్యంలో గ‌త వారం రోజులుగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు ప‌ర్యాట‌కులు పోటెత్తిన సంగ‌తి తెలిసిందే. దీంతో హిమాచల్ ప్ర‌దేశ్‌లోని ప‌ర్యాట‌క ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెల‌కొంది. కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు బారులు తీర‌డంతో గంట‌ల త‌ర‌బ‌డి వాహ‌న‌దారులు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయారు. లాహూల్ వ్యాలీలో భారీగా ట్రాఫిక్ క‌నిపించింది. దీంతో ట్రాఫిక్‌ను అధిగ‌మించేందుకు ఓ వ్య‌క్తి త‌న థార్ కారును న‌ది గుండా పోనిచ్చాడు. లాహూల్ వ్యాలీలో ఉన్న చంద్ర న‌దిలో కారును న‌డుపుతూ ముందుకు వెళ్లాడు. నీటి మ‌ట్టం త‌క్కువ‌గా ఉండ‌టంతో డ్రైవ‌ర్ ప్రాణాల‌కు ముప్పు వాటిల్ల‌లేదు. అయితే ఈ డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఈ ఘ‌ట‌న‌పై హిమాచ‌ల్ ట్రాఫిక్ పోలీసులు కూడా తీవ్రంగా స్పందించారు. వాహ‌న‌దారుడికి పోలీసులు చ‌లానా జారీ చేశారు. భ‌విష్య‌త్‌లో ఎవ‌రూ కూడా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా ఉండేందుకు చంద్ర న‌ది వ‌ద్ద పోలీసులు మోహ‌రించారు. ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ న‌ది వైపు ఎవ‌ర్నీ వెళ్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

లాహూల్ నుంచి మ‌నాలీ వెళ్లే మార్గంలో నిన్న ఈవినింగ్ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దాదాపు 55 వేల‌కు పైగా వాహ‌నాలు ఆగిపోయాయి. గ‌త మూడు రోజుల నుంచి ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాహ‌న‌దారులు వాపోయారు.