భూమికి అతిద‌గ్గ‌ర‌గా రెండు తోక‌చుక్క‌లు. ఒక‌టి ఎవ‌రెస్టు అంత పెద్దది!

ఉల్క‌లు, తోక‌చుక్క‌లు గ్ర‌హ‌శ‌క‌లాల గ‌మ‌నాన్ని ప‌రిశీలించే ఆస‌క్తి ఉన్న‌వారికి 2024 గొప్ప అవ‌కాశ‌మ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు

  • Publish Date - January 19, 2024 / 12:50 AM IST

ఉల్క‌లు (Meteors) , తోక‌చుక్క‌లు (Comets), గ్ర‌హ‌శ‌క‌లాల (Asteroids) గ‌మ‌నాన్ని ప‌రిశీలించే ఆస‌క్తి ఉన్న‌వారికి 2024 గొప్ప అవ‌కాశ‌మ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ముఖ్యంగా రెండు తోక చుక్క‌లు విను వీధిలో సంద‌డి చేయ‌నున్నాయ‌ని.. స‌రైన ప్రాంతం నుంచి ప‌రిశీలిస్తే మామూళు క‌ళ్ల‌తోనే వాటిని చూడ‌గ‌ల‌మ‌ని వెల్ల‌డించారు. ఇందులో ఒక దాన్ని డెవిల్ కామెట్ (దెయ్యపు తోక‌చుక్క‌) అని పేరు పెట్ట‌డం విశేషం. ఆ రెండు తోక‌చుక్కల్లో ఒక దాని పేరు 12పి-పోన్స్ బ్రూక్స్ కాగా మ‌రొక దాని పేరు సుచిన్‌షాన్- అట్లాస్‌. పోన్స్ బ్రూక్‌నే ఔత్సాహికులు డెవిల్ కామెట్ అని పిలుస్తున్నారు.


దీని గురించి ప‌రిశోధ‌కుల‌కు కొన్నేళ్ల నుంచే స‌మాచారం ఉన్న‌ప్ప‌టికీ.. సుచిన్‌షాన్ గురించి 2023లోనే వివ‌రాలు తెలిశాయి. డెవిల్ తోక‌చుక్క మార్చి లేదా ఏప్రిల్‌లో, సుచిన్‌షాన్ సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌రులో ఆకాశంలో మ‌న‌కు హాయ్ చెప్పి వెళ్లిపోనున్నాయి. డెవిల్ తోక‌చుక్క గురించి శాస్త్రవేత్త‌లు తెలిపిన ప్ర‌కారం.. ఇది ప్ర‌తి 71 ఏళ్ల‌కు మ‌న సూర్యునికి ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంది. దీనిలో నిరంత‌రం పేలుళ్లు సంభ‌విస్తూ అగ్ని జ్వాల‌ల‌ను వెలువ‌డుతుంటాయి. అందుకే దీనికి డెవిల్ అనే పేరును పెట్టిన‌ట్లు తెలుస్తోంది.


ఇప్ప‌టి వ‌ర‌కు శాస్త్రవేత్త‌లు దీనిపై ఏర్ప‌డిన నాలుగు పేలుళ్ల‌ను ప్ర‌త్య‌క్షంగా గ‌మ‌నించారు. పూర్తిగా మంచుతో క‌ప్ప‌బ‌డి ఉండే ఈ తోక‌చుక్క.. ప‌రిమాణంలో ప్ర‌పంచ‌లోనే ఎత్తైన ప‌ర్వ‌తం ఎవ‌రెస్టు అంత ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కాబ‌ట్టి మామూలు క‌ళ్ల‌తో కూడా దీనిని చూడొచ్చ‌ని చెబుతున్నారు. బైనాక్యుల‌ర్స్ ఉంటే మ‌రింత స్ప‌ష్టంగా చూసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. మ‌రో తోక చుక్క సుచిన్‌షాన్ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. దీనిని గ‌తేడాది జూన్‌లోనే క‌నుగొన్నారు.


సెప్టెంబ‌రు లేదా త‌ర్వాతి నెల‌లో ఇది భూమికి అతి ద‌గ్గ‌ర‌గా రానుంది. ప‌రిమాణంలో డెవిల్ కంటే చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ.. చాలా కాంతిమంతంగా ఉండ‌టం వ‌ల్ల ఎటువంటి ప్ర‌త్యేక ప‌రిక‌రాల సాయం లేకుండా దీనిన చూడొచ్చ‌ని శాస్త్రవేత్త‌లు తెలిపారు. అయితే ఇది ఒక్కోసారి కాంతిమంతంగా మ‌రోసారి కాంతివిహీనంగా మారిపోతుంద‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు దీనిని గ‌మ‌నిస్తూ ఉండాల‌ని సూచించారు.

Latest News