Site icon vidhaatha

Poverty | 41.5 శాతం మందికి పేదరికం నుంచి విముక్తి

Poverty

విధాత: భారతదేశంలో గత పదిహేనేళ్లలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్ఫర్డ్ పావర్టీహ్యూమన్ డెవలప్మెంట్ ఇన్సియేటివ్లు వెల్లడించాయి. ఈ సంస్థలు సంయుక్తంగా బహుముఖ పేదరిక సూచీ(ఎంపీఐ)ని తాజాగా విడుదల చేశాయి. 2005/2006 నుంచి 2019/2021 మధ్య భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ఈ సంస్థల నివేదిక పేర్కొంది.

భారత్‌తో సహా ఇరవై ఐదు దేశాలు పేదరికాన్ని చాలా వేగంగా తగ్గించగలిగాయని ఆ నివేదిక తెలిపింది. వేగవంతంగా పేదరికాన్ని తగ్గించిన దేశాల్లో భారత్తో పాటు కంబోడియా, చైనా, కాంగో, హోండురాస్, ఇండోనేసియా, మొరాకో, సెర్బియా, వియత్నాంలు ఉన్నాయి. అత్యధిక జనాభా కలిగిన చైనాను భారత్ గత ఏప్రిలులో దాటేసిన విషయం విదితమే.

పేదరిక నిర్మూలన సాధ్యమేనని గత పది హేనేళ్ల అనుభవం చూపెడుతున్నదని నివేదిక పేర్కొంది. భారత్‌లో 2005/2006లో 55.1 శాతంగా ఉన్నపేదరికం 2019/2021 నాటికి 16.4 శాతానికి పడిపోయిందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 23 కోట్ల మంది పేదరికంలో ఉన్నారని ఆ నివేదిక వివరించింది. అన్ని వర్గాలలో, అన్ని వయో గ్రూపులలో పేదరికం గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది.

పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య గత పదిహేనేళ్లలో 44.3 శాతం నుంచి 11.8 శాతానికి తగ్గింది. తాగునీటి అలభ్యతతో సతమతమయ్యే వారి శాతం 16.5 నుంచి 2.7 శాతానికి పడిపోయింది. విద్యుత్ అందని వారి శాతం 26 నుంచి 2.1 శాతానికి, గృహ వసతి లేని వారి శాతం 44.9 నుంచి 13.6 శాతానికి పడిపోయింది.

భారతదేశం 2005/2006 నుంచి 2015/2016 ల మధ్య ఎంపీఐని సగానికి సగం తగ్గించగలిగిందని ఆ నివేదిక పేర్కొంది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 110 దేశాలలో కటిక పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య 110 కోట్లు. ఉత్తారఫ్రికా, దక్షిణాసియా దేశాలలోని కటిక పేదరికం ఎక్కువగా ఉందని ఆ నివేదిక సూచించింది.

Exit mobile version