Site icon vidhaatha

Telangana | కేంద్రమే దిగొచ్చింది.. మ‌రి మీరు దిగ‌రా కేటీఆర్ సారూ.. గురుకుల ప‌రీక్ష‌ల‌ను తెలుగులోనూ నిర్వ‌హించండి..

Telangana | మా ఉద్యోగాలు మాకు కావాల‌నే నినాదంతో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం కొన‌సాగింది. ఆ స్థాయిలో తెలంగాణ ప‌రిధిలోని అన్ని యూనివ‌ర్సిటీల విద్యార్థులు, నిరుద్యోగులు చేసిన పోరాట ఫ‌లితంగానే ప్ర‌త్యేక‌ రాష్ట్రం ఏర్ప‌డింది. 2014 జూన్ 2వ తేదీన పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల మాట అంటేనే ఒళ్లంతా మంటెక్కుతోంది. నోటిఫికేష‌న్ల మాట అనేది నీటి మీద రాత‌లే. ఉద్యోగ నియామ‌కాల‌పై అన్ని వేదిక‌ల‌పై ఊక‌దంపుడు ఉప‌న్యాసాలే త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో పెట్టింది మాత్రం శూన్యం. ఒక వేళ ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఏదో కార‌ణంగా ఆ నోటిఫికేష‌న్ల‌న్నీ కోర్టు మెట్లెక్క‌డం, తీవ్ర జాప్యం జ‌ర‌గ‌డం చూస్తూనే ఉన్నాం. మొన్న‌టికి మొన్న నిర్వ‌హించిన గ్రూప్ -1 ప్రిలిమిన‌రీ ఎగ్జామ్ నుంచి మొద‌లుకుంటే దాదాపు ఆరేడు ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాలు లీక్ అవ్వ‌డం అంద‌రికీ తెలిసిందే.

ఇదంతా ఒకేత్తు అయితే.. రాత ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన మీడియం అనేది గ్రామీణ విద్యార్థుల‌కు, నిరుద్యోగ యువ‌త‌కు పెనుస‌వాలుగా మారింది. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత నిర్వ‌హించిన ప‌లు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించిన రాత‌ ప‌రీక్ష‌ల‌ను ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వ‌హించారు. దీంతో చాలా మంది యువ‌త న‌ష్ట‌పోయారు కూడా. ఇందులో ఎలాంటి అనుమానం, సందేహం అక్క‌ర్లేదు.

ఎందుకంటే ఒక ప‌దేండ్ల క్రితం డిగ్రీలు అయిపోయిన యువ‌త‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే.. అప్పుడు అన్ని తెలుగు మీడియం చ‌దువులే. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి మొద‌లుకుంటే డిగ్రీ వ‌ర‌కు తెలుగు భాష‌లోనే చ‌దివారు. త‌ప్ప ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేదు. ఇంగ్లీష్ చ‌దువంటే ఏంటో తెలియ‌దు. ఒక వేళ ఆంగ్ల మాధ్య‌మంలో చ‌ద‌వాలంటే ఆర్థిక స్తోమ‌త కూడా అంత‌త మాత్ర‌మే. కాబ‌ట్టి నిరుపేద యువ‌త ఇంగ్లీష్ మీడియం చ‌దువుల‌కు నోచుకోలేదు.

ఇంగ్లీష్, తెలుగు మాధ్యమం అనేది ఉద్యోగ నియామ‌క రాత ప‌రీక్ష‌ల్లో చాలా ప్రాధాన్య అంశ‌మ‌ని చెప్పొచ్చు. ఈ మాధ్య‌మ‌మే ఉద్యోగాన్ని డిసైడ్ చేసే స్థాయికి కూడా వెళ్లింద‌ని ఘంటాప‌థంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే.. సీఏపీఎఫ్ ఉద్యోగాల‌కు ప్రాంతీయ భాష‌ల్లోనూ పరీక్ష‌లు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. కేంద్ర స్థాయిలో భ‌ర్తీ చేసే గ్రూప్-బీ, గ్రూస్-సీ ఉద్యోగాల‌తో పాటు స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిటీ ఉద్యోగాల ప‌రీక్ష‌ల‌ను తెలుగు భాష‌లోనూ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యానా ప‌లుమార్లు కేంద్రానికి లేఖలు రాసి విజ్ఞ‌ప్తులు చేస్తూ వ‌చ్చారు. అయితే తండ్రీకుమారుల విజ్ఞ‌ప్తుల‌కు కేంద్రం స్పందించింది. ఇకపై కేంద్ర స్థాయిలో జ‌రిగే ఉద్యోగ నియామ‌క ప‌రీక్ష‌ల‌ను ప్రాంతీయ భాష‌ల్లోనూ నిర్వ‌హిస్తామ‌ని, ఈ నిబంధ‌న వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌ల‌వుతుంద‌ని కేంద్రం తాజాగా ప్ర‌క‌టించింది.

అయితే ఈ కేంద్రం ప్ర‌క‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. అమిత్ షా జీ కృత‌జ్ఞ‌త‌లు. సీఏపీఎఫ్ ఎగ్జామ్స్ తెలుగులో నిర్వ‌హించ‌డం వ‌ల్ల వేలాది మంది తెలుగు విద్యార్థుల‌కు లాభం జ‌రుగుతుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. మ‌రి సొంత రాష్ట్రంలోనే గురుకుల నియామ‌క బోర్డు చేప‌డుతున్న ఉద్యోగాల భ‌ర్తీని ఎందుకు తెలుగు మాధ్య‌మంలో నిర్వ‌హించ‌డం లేద‌నేది ప్ర‌శ్న‌. కేవ‌లం రాజ‌కీయాల కోస‌మే ఈ ఎత్తుగ‌డ‌లు వేస్తూ.. యువ‌త‌ను మ‌భ్య పెడుతున్నారు. నిజంగా ఈ రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలుగు విద్యార్థులు.. అది తెలంగాణ విద్యార్థుల‌పై ప్రేమ ఉంటే గురుకులాల్లో చేప‌ట్టే జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్, టీజీటీ, పీజీటీ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఎందుకు తెలుగు మాధ్య‌మంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌రు. 4020 టీజీటీ, 1276 పీజీటీ, 2008 జేఎల్ పోస్టుల‌ను గురుకుల నియామ‌క బోర్డు భ‌ర్తీ చేస్తోంది. ఇటీవ‌ల టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసిన జేఎల్ నోటిఫికేష‌న్‌పై కూడా నిరుద్యోగ యువ‌త రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించారు. జేఎల్ పోస్టుల‌కు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని హైకోర్టు ఆదేశించింది. మ‌రి తెలుగు మీడియంలో కూడా రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే గురుకుల‌ పోస్టుల‌కు ప్రిపేర‌య్యే ల‌క్ష‌లాది మంది అభ్య‌ర్థుల‌కు లాభం చేకూరుతుంది క‌దా.. కేటీఆర్ సారూ.. మిమ్మ‌ల్ని మ‌రోసారి ఆశీర్వ‌దించి గెలిపిస్త‌రు క‌దా.. కేసీఆర్ సారూ..

Exit mobile version