Jubilee Hills By Poll | హైదరాబాద్ : బర్రెలక్క( Barrelakka ) అలియాస్ కర్నె శిరీష( Karne Shirisha ).. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే నిరుద్యోగుల( Un Employees ) తరపున నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్( Kollapur ) నియోజకవర్గం నుంచి బరిలో దిగి నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలిచింది. నాడు బర్రెలక్కకు నిరుద్యోగులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌లు, మేధావి వర్గం నుంచి సంపూర్ణ మద్ధతు లభించింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) ఆమె గెలవలేదు. అయినప్పటికీ బర్రెలక్క ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా జూబ్లీహిల్స్( Jubilee Hills ) నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubilee Hills By Poll )ను నిరుద్యోగులు వేదికగా మలుచుకున్నారు. నాడు కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన బర్రెలక్కను ఆదర్శంగా తీసుకుని, నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంతో మంది ఉన్నత విద్యావంతులు బరిలో దిగారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నిరుద్యోగుల సమస్యల పట్ల తమ గళాన్ని అసెంబ్లీలో వినిపించేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. రాజకీయ పార్టీలు తమను నిర్లక్ష్యం చేస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చులేకపోతున్నాయని మండిపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన కందారపల్లి కాశీనాథ్ బోటనీ, సైకాలజీ, ఇస్లామిక్ స్టడీస్‌లో పీజీ చేశాడు. కొత్తగా నోటిఫికేషన్లు రాకపోవడంతో.. ఉద్యోగానికి ప్రిపేరయ్యే పరిస్థితి లేదు. దీంతో నిరుద్యోగుల తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపాడు. మరో నిరుద్యోగ అభ్యర్థి ఆరోళ్ల ప్రవీణ్ కుమార్.. యూసుఫ్‌గూడ నివాసి. ఆయన సైకాలజీలో పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నాడు. ఈ ఉప ఎన్నకలో ప్రజా వెలుగు పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్‌కు కెమెరా గుర్తు కేటాయించారు.
షేక్ రఫత్ పహాన్ అనే ముస్లిం యువతి కూడా ఈ ఉప ఎన్నికల బరిలో దిగారు. ఆమె అప్లైడ్ మ్యాథమేటిక్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఈమెకు పడవ గుర్తు కేటాయించారు. జనగామకు చెందిన అనిల్ కుమార్ గాదేపాక కాకతీయ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్‌మెంట్ నాలుగేండ్ల క్రితం పూర్తి చేశాడు. అనిల్ కుమార్ కూడా ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుంచి యదీశ్వర్ నక్కా బరిలో ఉన్నాడు. యదీశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ఎం పట్టా పుచ్చుకున్నాడు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆస్మా బేగం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆస్మా ఎంఏ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్నారు. ఆమె నిరుద్యోగుల తరపున అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆస్మాకు బ్యాటరీ టార్చ్ గుర్తు కేటాయించారు.
బర్రెలక్క కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యేనా..?
కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్కకు 5754 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమి చవిచూశారు. ఎంపీ అభ్యర్థిగా మాత్రం కేవలం 3087 ఓట్లు మాత్రమే సాధించింది బర్రెలక్క. మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బర్రెలక్క కంటే ఎక్కువ ఓట్లు ఎవరు సాధిస్తారో..?
మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ..
నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీ పడగా, 2023 అసెంబ్లీలో 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
భారీగా నామినేషన్లు ఎందుకంటే..?
ప్రధానంగా రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ నిర్వాసితులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ 12 మంది, యాచారం ఫార్మాసిటీ భూనిర్వాసితులు 10 మంది, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 10 మంది, ఉద్యోగ నియామక ప్రకటనలు లేవని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ తరపున 13 మంది, పెన్షన్లు సక్రమంగా రావడం లేదని పెన్షన్‌దారుల తరపున 9 మంది సీనియర్ సిటిజన్లు నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల తరపున ఒకరు నామినేషన్ వేశారు.
