విధాత: గత డిసెంబర్‌లో కేరళలో చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం మార్కో (Marco). తెలుగులో భాగమతి, జనతా గ్యారేజ్ చిత్రాలలో ముఖ్య పాత్రలలో నటించిన ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ఈ మూవీలో హీరోగా నటించగా హనీఫ్ అడేని (Haneef Adeni) దర్శకత్వం వహించాడు. మోస్ట్ ఎవర్ వయలెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సీపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసింది. జనవరి1న తెలుగులోను థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇక్కడా మంచి ఆదరణననే దక్కించుకుంది. ఇప్పుడీ సినిమా 70 రోజుల తర్వాత ప్రకటించిన తేదీ కన్నా ఓ రోజు ముందే మార్కో (Marco) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ సిటీలో ఆడెట్టు జార్జ్ ఫ్యామిలీ, రస్సెల్ ఫ్యామిలీల మధ్య బిజినెస్ పరంగా వైరం ఉంటుంది. ఓ సారి అనుకోని పరిస్థితుల్లో రస్సెల్ టీం చేతిలో ఆడెట్టు వారసుడు విక్టర్ హత్య చేయబడతాడు. దీంతో కొంతకాలంగా గొడవలకు దూరంగా ఉంటున్న ఆడెట్టు ఫ్యామిలీ ఈ విషయాన్ని తట్టుకోలేక పోతుంది. ఈ హత్య వార్త కాస్తా వారి పెంపుడు కుమారుడు విక్టర్ అంటే ప్రాణమైన మార్కో చెవిన పడుతుంది. దీంతో అతను ప్రతీకారం కోసం రంగంలోకి దిగి దొరికిన వారిని దొరికినట్లు చంపుతూ పోతూ రస్సెల్‌ను కూడా చంపుతాడు. ఈ క్రమంలో అంతా అయిపోయిందనుకున్న సమయంలో రస్సెల్ మరో భార్య కుమారుడు, క్రూరుడైన సైరస్ ఐజాక్ పగతో రగిలిపోతూ మార్కో మినహా ఫ్యామిలీ మొత్తాన్ని మట్టు బెడతాడు. ఈ నేపథ్యంలో చివరకు మార్కో అతనిని ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు ఎవరు గెలిచారు, ఎవరు మిగిలారనేదే కథ.
మితిమీరిన హింస, పోరాట దృశ్యాలు, చంపే విధానాలు అన్ని కొత్తగా తెరకెక్కించి శృతి మించిన రక్తపాతంతో నిండిన ఈ సినిమా యాక్షన్ ప్రియులకు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ముందుగా చెప్పిన ప్రకారం ఫ్రిబ్రవరి 14 నుంచి ఓటీటీకి రావాల్సి ఉన్నప్పటికీ ఓ రోజు ముందుగానే సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ (OTT)లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు. సినిమాలో ఎక్కడా అశ్లీలత, అసభ్యకరమైన సన్నివేశాలు లేనప్పటికీ సున్నిత మనస్కులు, పిల్లలు, మహిళలు సినిమా చూడకుండా ఉండడం మంచిది. అంత వయలెంట్‌గా ఈ మార్కో (Marco) సినిమాలో యాక్షన్ సీన్స్ చిత్రీకరించబడ్డాయి.