Police Officer | ఓ పోలీసు ఆఫీసర్ భార్యాపిల్లలు తమ ఇంట్లో ఉన్న రూ. 500 నోట్ల కట్టలతో సెల్ఫీ దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సదరు పోలీసు ఆఫీసర్‌ను బదిలీ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రమేశ్ చంద్ర సహాని అనే వ్యక్తి ఉన్నావ్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్‌కు స్టేషన్ ఇంచార్జిగా కొనసాగుతున్నాడు. అయితే అతని భార్య, ఇద్దరు పిల్లలు తమ ఇంట్లోని బెడ్‌పై రూ. 500 నోట్ల కట్టలతో సెల్ఫీ దిగారు. అనంతరం ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ ఫోటోలు పోలీసు ఉన్నతాధికారుల దాకా చేరాయి. దీంతో రమేశ్ చంద్రను బదిలీ చేశారు.
ఈ ఘటనపై రమేశ్ చంద్ర స్పందించారు. ఆ ఫోటోలు ఇప్పటివి కావు అని తెలిపారు. 2021, నవంబర్ 14వ తేదీన దిగినట్లు చెప్పారు. అప్పుడు తనకు సంబంధించిన ఆస్తులు విక్రయించగా, రూ. 14 లక్షలు వచ్చాయని, అది అదే నగదు అని పేర్కొన్నాడు. మొత్తానికి ఈ భారీ నగదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.