Site icon vidhaatha

నటి జయప్రదకు షాక్‌.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన యూపీ కోర్టు

విధాత‌: సీనియర్‌ నటి జయప్రదకు యూపీ కోర్టు షాక్‌ ఇచ్చింది. 2019 కేసులో మొరాదాబాద్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు హేబిటాట్ ముస్లిం ఇంటర్ కాలేజ్‌లో జరిగిన సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ హసన్ అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేత ఆజం ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లా ఆజం పాల్గొన్నారు.


ఈ కేసులో తండ్రి కొడుకులు సైతం నిందితులుగా ఉన్నారు. వ్యాఖ్యలపై మొరాదాబాద్‌లో పోలీసు కేసు నమోదైంది. కేసులో వాంగ్మూలం నమోదు చేసేందుకు జయప్రదను చాలాసార్లు విచారణకు రావాలని కోరారు. విచారణకు రాకపోవడంతో ఆమె కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిందని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మోహన్‌లాల్‌ బిష్ణోయ్‌ పేర్కొన్నారు.


ఈ కేసులో ఆజం ఖాన్, అబ్దుల్లా ఆజం, ఎస్‌టి హసన్, హజర్ ఖాన్, ఆరిఫ్ హసన్ సహా ఆరుగురు నిందితులు ఉన్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాంపూర్‌ ఎంపీగా ఎన్నికైన ఆజం ఖాన్‌ను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతలు జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.


ఐపీసీ సెక్షన్లు 354-A, 509 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2019 అక్టోబర్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో జయప్రదపై రాంపూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు విచారణ కోసం ఆమె వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.


ఇదిలా ఉండగా.. జయప్రద ఇటీవల పలు లీగల్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో చెన్నై కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. థియేటర్‌ వ్యాపారంలో ఉద్యోగులకు స్టేట్‌ ఇన్సూరెన్స్‌ నిధులను చెల్లించడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. ఇదే కేసులో సహ వ్యాపారవేత్తలు రామ్ కుమార్, రాజబాబులను సైతం కోర్టు దోషులుగా తేల్చింది.

Exit mobile version